Fans Blame KL Rahul: కేఎల్ రాహుల్‌కు తప్పని తిట్లు.. చేయని తప్పుకు..!
ABN , Publish Date - Jul 14 , 2025 | 06:06 PM
చేయని తప్పుకు తిట్లు తింటున్నాడు కేఎల్ రాహుల్. అతడి తప్పేమీ లేకపోయినా చాలా మంది అభిమానులు నీదే మిస్టేక్ అంటూ స్టార్ బ్యాటర్‌ను తప్పుబడుతున్నారు. అసలేం జరిగిందంటే..

క్రికెట్‌లో విమర్శలు సహజమే. ఆటగాళ్లు రాణించినప్పుడు వాళ్లను అంతా ప్రశంసల్లో ముంచెత్తుతారు. అదే విఫలమైతే మాత్రం విమర్శనాస్త్రాలు ఎదుర్కోక తప్పదు. టీమ్ ఓటమికి కారణమైన ప్లేయర్లపై తీవ్రంగా విమర్శలు వస్తుంటాయి. అయితే ఒక్కోసారి చేయని తప్పుకు కూడా ఆటగాళ్లు బలవుతుంటారు. టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. తప్పు చేయకపోయినా రాహుల్ ట్రోలింగ్ బారిన పడ్డాడు. అసలేం జరిగింది? రాహుల్‌ను ఎందుకు విమర్శిస్తున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..
స్ట్రయిక్ ఎందుకు ఇచ్చాడు?
లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు చివరి సెషన్ అది. రాహుల్‌తో పాటు పేసర్ ఆకాశ్‌దీప్ క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, యంగ్ స్పీడ్‌స్టర్ బ్రైడన్ కార్స్ భీకరంగా బౌలింగ్ చేస్తున్నారు. బంతి అనూహ్యంగా బౌన్స్ అవడం, స్లోప్ మీద పడి దిశ మార్చుకొని వేగంగా దూసుకొస్తుండటంతో బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ తరుణంలో చివరి ఓవర్ వేసేందుకు వచ్చాడు స్టోక్స్. దీంతో వికెట్ ఇవ్వొద్దనే ఉద్దేశంతో రాహుల్ సింగిల్ తీసి నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌కు వెళ్లిపోయాడు. అంతకముందు ఓవర్‌లో కూడా అతడు ఇదే పని చేశాడు. స్ట్రయికింగ్‌కు వచ్చిన ఆకాశ్‌దీప్ ఎలాగోలా మూడు బంతులు డిఫెన్స్ చేశాడు. ఆఖరికి నాలుగో బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆ రోజు ఆట ముగిసింది. అయితే ఇదే విషయంపై కొందరు నెటిజన్స్ రాహుల్‌ను విమర్శిస్తున్నారు.
తప్పెవరిది?
రాహుల్ స్వార్థపరుడని, తన వికెట్ కాపాడుకునేందుకు ఆకాశ్‌దీప్‌ను బలి చేశాడని నెటిజన్స్ దుయ్యబడుతున్నారు. ఆకాశ్‌దీప్‌కు స్ట్రయిక్ ఎందుకు ఇచ్చాడో అర్థం కావడం లేదు.. ఇదేం పని అంటూ సీరియస్ అవుతున్నారు. రాహుల్ వల్లే ఆకాశ్‌దీప్ ఔట్ అయ్యాడని.. ఇది కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎక్స్‌పర్ట్స్ దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. రాహుల్ చేసిన దాంట్లో తప్పేమీ లేదని అంటున్నారు. ఆకాశ్‌దీప్ కంటే రాహుల్ వికెటే టీమ్‌కు చాలా ముఖ్యమని.. అతడు క్రీజులో ఉండటం జట్టుకు అత్యవసరం అని చెబుతున్నారు. నైట్‌వాచ్‌మన్ పని ప్రధాన బ్యాటర్‌ను కాపాడటమేనని.. ఆకాశ్‌దీప్ అదే పని చేశాడని, అనవసరంగా రాహుల్‌ను తిట్టొద్దని చెబుతున్నారు. ఇందులో అతడి తప్పేమీ లేదని అంటున్నారు. టీమ్ కోసం ఎంతో చేస్తున్న ప్లేయర్‌ను ఇలా విమర్శించడం సరికాదని మండిపడుతున్నారు.
ఇవీ చదవండి:
ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీల పోటాపోటీ!
సిరాజ్ దొరికినా గిల్ తప్పించుకున్నాడు!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి