Share News

AUS vs SA: కప్పు ఆసీస్‌దే.. చేజేతులా చేసుకుంటున్న సౌతాఫ్రికా!

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:18 PM

ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ పోరులో ఎవరూ ఊహించని విధంగా తొలి రోజే ఏకంగా 14 వికెట్లు నేలకూలాయి. అయితే డే-1 ఆసీస్‌దే పైచేయి అని చెప్పాలి.

AUS vs SA: కప్పు ఆసీస్‌దే.. చేజేతులా చేసుకుంటున్న సౌతాఫ్రికా!
WTC Final-2025

ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్-2025లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ సమరంలో తొలి రోజు రెండు జట్లు నువ్వానేనా అంటూ తలపడ్డాయి. అయితే అనూహ్యంగా 14 వికెట్లు నేలకూలాయి. పిచ్ నుంచి సీమ్, స్వింగ్‌కు మద్దతు లభించడంతో ఇరు జట్ల పేసర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. ఆస్ట్రేలియాను 212 పరుగులకే కట్టడి చేశారు సఫారీ బౌలర్లు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ మొదటి రోజు ముగిసేసరికి 4 వికెట్లకు 43 పరుగులతో కష్టాల్లో పడింది. ఓవరాల్‌గా చూసుకుంటే డే-1 కంగారూల ఆధిపత్యమే నడిచింది. తొలి ఐసీసీ ట్రోఫీ వేటలో ఉన్న సౌతాఫ్రికా ఓటమిని కొనితెచ్చుకున్నట్లే కనిపిస్తోంది. దీని గురించి మరింతగా చూద్దాం..

aus-vs-sa.jpg


ఇక కష్టమే..

పేసర్లకు స్వర్గధామంగా మారిన లార్డ్స్ పిచ్‌పై ఆసీస్ చేసిన 212 పరుగులు కూడా భారీ స్కోరుగా కనిపిస్తోంది. సౌతాఫ్రికా 43 పరుగులకు 4 వికెట్లు కోల్పోవడంతో కనీసం 150 స్కోరైనా చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పేస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొనే ఎయిడెన్ మార్క్రమ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. నాటౌట్‌గా ఉన్న కెప్టెన్ తెంబా బవుమా (3) ఖాతా తెరవడానికి ఏకంగా 30 బంతులు తీసుకున్నాడు. రికల్టన్ (16), ముల్డర్ (6), స్టబ్స్ (2) లాంటి హిట్టర్లు రెండంకెల స్కోరు కూడా చేయకుండానే వెనుదిరిగారు. ఇంకో రెండు వికెట్లు పడితే అంతా ఆల్‌రౌండర్లే ఉన్నారు. వీళ్ల అండతో బవుమా భారీ స్కోరు సెట్ చేయడం అసంభవంగా కనిపిస్తోంది.

aus-vs-sa-21.jpg


పేసర్లకు భయపడి..

డే-1 సౌతాఫ్రికా రెండు భారీ తప్పులు చేసింది. అందులో ఒకటి బౌలింగ్‌ సమయంలో బ్యూ వెబ్‌స్టర్ (72), అలెక్స్ కేరీ (23) జోడీని విడదీయడంలో ఆలస్యం చేశారు. వీళ్లిద్దరూ కలసి 7వ వికెట్‌కు 46 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బౌలర్ల అలసత్వంతో ఆసీస్ స్కోరు 200 దాటింది. ఇక, బ్యాటింగ్ టైమ్‌లో ప్రొటీస్ పూర్తిగా రక్షణాత్మక ధోరణిలో ఆడింది. మార్క్రమ్, రికల్టన్, ముల్డర్, స్టబ్స్.. వీళ్లంతా అటాకింగ్ బ్యాటర్స్. కానీ ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా దూకుడుగా ఆడలేదు. కమిన్స్ అండ్ కో చెలరేగుతుండటంతో అతిగా డిఫెన్స్ చేయడానికి వెళ్లి భారీ మూల్యం చెల్లించుకున్నారు. కనీసం ఒక్క బ్యాటర్ అయినా అటాక్ చేసి ఉంటే మరో 30 నుంచి 40 పరుగులు స్కోరు బోర్డు మీదకు చేరేవి. అప్పుడు తర్వాత వచ్చే బ్యాటర్లపై కాస్త ఒత్తిడి తగ్గేది. ప్రెజర్ అంతా ఆసీస్‌పై పడేది. రెండో రోజు ఆరంభంలో వికెట్లు పడితే సౌతాఫ్రికా పనైపోయినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. రెండు తప్పిదాలు ప్రొటీస్‌ను ముంచాయని.. ఆ జట్టు చేజేతులా చేసుకుందని చెబుతున్నారు.


ఇవీ చదవండి:

కోచ్‌కు బుమ్రా షాక్

టీమిండియాకు కొత్త టెన్షన్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 12 , 2025 | 12:28 PM