IND vs PAK: ఇండో-పాక్ వార్.. యుద్ధాన్ని తలపించే పోరు.. తేదీ గుర్తుపెట్టుకోండి!
ABN , Publish Date - Jun 29 , 2025 | 03:33 PM
భారత్-పాకిస్థాన్ పోరుకు అంతా సిద్ధమవుతోంది. త్వరలో ఈ రెండు జట్లు మైదానంలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. మరి.. ఈ సమరం ఎప్పుడు జరగనుందో ఇప్పుడు చూద్దాం..

పహల్గాం దాడితో భారత్-పాకిస్థాన్ నడుమ ఉద్రిక్తతలు తలెత్తాయి. శత్రుదేశం చేసిన గాయానికి ఆపరేషన్ సిందూర్‌తో ప్రతీకారం తీర్చుకుంది ఇండియా. దీని తర్వాత ఇరు దేశాలు దాడులు-ప్రతిదాడులు చేసుకోవడం, పాక్‌కు మన జవాన్లు మూడు చెరువుల నీళ్లు తాగించడం తెలిసిందే. మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్లకు తెలిసొచ్చింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినా త్వరలో మరో యుద్ధం జరగనుంది. అయితే ఈసారి రెండు దేశాల జట్లు మైదానంలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఆసియా కప్-2025లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య వార్ జరగనుంది. ఈ మ్యాచ్ తేదీతో పాటు ఆసియా కప్ షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ఫార్మాట్ మార్పు పక్కా?
పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో అన్ని రకాల సంబంధాలు తెంచుకుంది భారత్. క్రికెట్ రిలేషన్స్ కూడా కట్ చేసేసింది. ఆ టీమ్‌తో భవిష్యత్తులో ఏ సిరీస్ కూడా ఉండదని, ఐసీసీ ఈవెంట్లలో పాక్‌తో మ్యాచుల్ని భారత్ నిషేధిస్తుందని వార్తలు వినిపించాయి. దీంతో ఇక ఇండో-పాక్ క్లాష్ చూడలేమని అంతా అనుకున్నారు. కానీ త్వరలో జరిగే ఆసియా కప్‌లో ఈ ఇరు జట్లు తలపడటం ఖాయమని తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి ఈ టోర్నీని మొదలుపెట్టాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) పెద్దలు భావిస్తున్నారని సమాచారం. జులై మొదటి వారంలో టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేస్తారట. ఈసారి టీ20 ఫార్మాట్‌లో మ్యాచులు ఉంటాయని తెలుస్తోంది.
అంతా బీసీసీఐ చేతుల్లోనే..
ఏసీసీ పెద్దలు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 10 నుంచి ఆసియా కప్ మొదలవడం ఖాయమని సమాచారం. భారత్, పాకిస్థాన్, శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్, యూఏఈ టోర్నీలో పాల్గొంటాయని వినిపిస్తోంది. యూఏఈలో మ్యాచులు జరుగుతాయని తెలుస్తోంది. కాగా, ఆసియా కప్-2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇండియా-పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొనడంతో టోర్నీని యూఏఈకి తరలించాలని ఏసీసీ పెద్దలు నిర్ణయించారట. అయితే షెడ్యూల్ విడుదలై టోర్నీ మొదలయ్యేంత వరకు ఆసియా కప్ జరుగుతుందా? లేదా? అనేది చెప్పలేని పరిస్థితి. పాక్‌తో ఆడే విషయంలో బీసీసీఐ తీసుకునే నిర్ణయాన్ని బట్టే టోర్నీ నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
ఆర్సీబీ క్రికెటర్‌పై యువతి ఫిర్యాదు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి