Ajinkya Rahane On Re-Entry: తప్పకుండా వస్తా.. రహానె ప్లానింగ్ మామూలుగా లేదుగా!
ABN , Publish Date - Jul 13 , 2025 | 01:07 PM
టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె మళ్లీ వస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన పని అయిపోలేదన్నాడు. రహానె ఇంకా ఏం చెప్పాడంటే..

అజింక్యా రహానె.. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన వారిలో బడా ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు ఏళ్ల పాటు సేవలు అందించాడు. టెస్టుల్లోనైతే తోపు బ్యాటర్‌గా గుర్తింపు సంపాదించాడు. 85 టెస్టుల్లో 5 వేలకు పైగా పరుగులు చేసిన రహానె.. వైస్ కెప్టెన్‌గా ఉంటూ మెన్ ఇన్ బ్లూ సక్సెస్‌లో కీలకపాత్ర పోషిస్తూ వచ్చాడు. అలాంటోడు ఒక్కసారిగా భారత జట్టుకు దూరమయ్యాడు. అతడు టీమిండియాకు ఆడి రెండేళ్లు కావొస్తోంది. వయసు మీద పడటం, యువ ఆటగాళ్లు అదరగొడుతుండటంతో టీమిండియాలోకి రహానె రీఎంట్రీ కష్టమేనని అంతా అనుకుంటున్నారు. ఈ తరుణంలో వెటరన్ బ్యాటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..
ఓటమి ఒప్పుకోను..
రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నానని.. త్వరలో భారత జట్టులోకి తిరిగొస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు రహానె. లార్డ్స్ టెస్ట్‌కు హాజరైన సీనియర్ బ్యాటర్.. కమ్‌బ్యాక్ ప్లాన్స్‌ను బయటపెట్టాడు. ‘ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. నేను ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడాలని ఉత్సుకతతో ఉన్నా. ఇప్పుడు క్రికెట్‌ను చాలా ఆస్వాదిస్తున్నా. నన్ను నేను ఫిట్‌గా ఉంచుకోవడం, దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టడం మీద దృష్టి సారిస్తున్నా. నాది ఓటమి ఒప్పుకోని తత్వం. బరిలోకి దిగితే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. జట్టు కోసం నా 100 శాతం ఎఫర్ట్ పెడుతుంటా. మన చేతిలో ఉన్న విషయాలను కంట్రోల్ చేయగలగాలి’ అని రహానె చెప్పుకొచ్చాడు. రీఎంట్రీ కోసం రహానె ఉవ్విళ్లూరుతున్నా అతడికి సెలెక్టర్లు ఇంకో అవకాశం ఇచ్చే చాన్సులు తక్కువగా కనిపిస్తున్నాయి. 37 ఏళ్ల రహానేకు అవకాశం ఇచ్చే బదులు యువ ఆటగాళ్లను ప్రోత్సహించే చాన్సులు ఎక్కువ. మరి.. రహానె కమ్‌బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి