Share News

BCCI: కోచ్ పదవిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. స్పష్టం చేసిన బీసీసీఐ

ABN , Publish Date - Nov 27 , 2025 | 02:38 PM

సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. గంభీర్‌కు బీసీసీఐ మద్దుతుగా నిలిచింది.

BCCI: కోచ్ పదవిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. స్పష్టం చేసిన బీసీసీఐ
Gautam Gambhir

ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. రెండు టెస్టుల్లో ఓడి 2-0 తేడాతో వైట్ వాష్‌కు గురైంది. నిరుడు స్వదేశంలోనే న్యూజిలాండ్ చేతుల్లో కూడా క్లీన్ స్వీప్ అయింది. గంభీర్ టీమిండియాకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు 16 నెలల కాలంలో భారత్ మూడు టెస్టు సిరీస్‌లు ఓడిపోయింది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్‌గా గంభీర్‌(Gautam Gambhir)ను తొలగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ(BCCI) గంభీర్‌కు మద్దతుగా నిలబడింది.


‘బీసీసీఐ తొందర పడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. ప్రస్తుతం టీమిండియా మార్పు దశలో ఉంది. వరల్డ్ కప్ సమీపిస్తోన్న నేపథ్యంలో కోచ్ గంభీర్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయమూ తీసుకోం. అతడి కాంట్రాక్ట్ 2027 ప్రపంచ కప్ వరకు ఉంది. బీసీసీఐ.. సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి ముందుకు సాగుతుంది. కానీ కోచ్ విషయంలో సంచలన నిర్ణయాలు అంటూ ఏమీ ఉండవు’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.


బుధవారం గువాహటి టెస్టు అనంతరం విలేకరుల సమావేశంలో గంభీర్ మాట్లాడిన విషయం తెలిసిందే. కోచ్‌గా తన భవిష్యత్తు విషయంలో విలేకరుల నుంచి ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘ఆ విషయాన్ని బీసీసీఐ నిర్ణయిస్తుంది. భారత క్రికెట్ ముఖ్యం.. కానీ నేను కాదు. ఈ విషయాన్ని నేను టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితమైన తర్వాత నిర్వహించిన మొదటి ప్రెస్‌మీట్‌లోనే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. యువ జట్టుతో ఇంగ్లండ్‌లో సాధించిన ఫలితాలను మర్చిపోయిన అభిమానులు.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి గురించే మాట్లాడుతారు. నేను కోచ్‌గా ఉన్నప్పుడే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌ కూడా గెలిచింది’ అని గంభీర్ అన్నాడు.


ఇవి కూడా చదవండి:

Smriti unfollowed Palas: ఇన్‌స్టా‌లో పలాశ్‌ను అన్‌ఫాలో చేసిన స్మృతి! నిజం ఏంటంటే..

ఈ క్రెడిట్ మా టీమ్ మొత్తానిది.. విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా

Updated Date - Nov 27 , 2025 | 02:46 PM