Bangladesh sweeps Test series: బ్యాటర్ల విజృంభణ.. టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లాదేశ్
ABN , Publish Date - Nov 24 , 2025 | 07:48 AM
ఐర్లాండ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను బంగ్లాదేశ్ 2-0తో కైవసం చేసుకుంది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో 217 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: పసికూన ఐర్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ ను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్(Bangladesh vs Ireland Test Series) చేసింది. రెండో టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్ 217 పరుగుల తేడాతో ఐర్లాండ్ పై విజయం సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ను 2-0తో బంగ్లా కైవసం(Bangladesh Series Sweep) చేసుకుంది. బ్యాటర్ల విజృంభణకు బౌలర్ల సహకారం తోడవడంతో బ్లంగాదేశ్ సిరీస్‌ను చేజిక్కించుకుంది. 509 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 176/6తో ఆదివారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఐర్లాండ్ 291 పరుగులకు ఆలౌటైంది.
కాంపెర్ పోరాటం వృథా:
ఇక ఐర్లాండ్ బ్యాటర్లు కర్టీస్ కాంపెర్ (259 బంతుల్లో 71*) మ్యాచ్‌ను ‘డ్రా’ చేసేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. టెయిలెండర్లతో కలిసి చక్కటి పోరాటంతో బంగ్లాదేశ్‌ను విసిగించాడు. ఆఖరి రోజు(ఆదివారం) దాదాపు 60 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన అతడు మ్యాచ్‌ను కాపాడలేకపోయినా... తన అసమాన పోరాటంతో అందర్ని ఆకట్టుకున్నాడు. జోర్డాన్ నీల్ (46 బంతుల్లో 30)తో కలిసి 85 బంతుల్లో 48 పరుగులు జోడించిన కాంపెర్, ఆ తర్వాత చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన గవిన్ హోయ్ (104 బంతుల్లో 37)తో కలసి చాలాసేపు బ్యాటింగ్ చేశాడు. ఈ జోడీ 9వ వికెట్‌కు 191 బంతుల్లో 54 పరుగులు చేసింది. బంగ్లా స్పిన్నర్లు ఎంతగా పరీక్షిస్తున్నా ఈ జంట సహనం కోల్పోలేదు.
దీంతో ఐర్లాండ్(Ireland) మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకునేలా కనిపించింది. కానీ హసన్ మురాద్ వరుస బంతుల్లో గవిన్, మాథ్యూను అవుట్ చేసి ఐర్లాండ్ ఓటమిని ఖరారు చేశాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్, హసన్ మురాద్ చెరో నాలుగు వికెట్లు సాధించారు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగులు చేయగా... ఐర్లాండ్ 265 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా 297/4 వద్ద డిక్లేర్ చేసింది. చివరకు 217 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది. కెరీర్‌లో వందో టెస్టులో సెంచరీతో మెరిసిన ముష్ఫికర్ రహీమ్‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, తైజుల్ ఇస్లామ్(Taijul Islam) ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు అందుకున్నారు.
ఇవీ చదవండి: