Blind Womens T20 World Cup: మన అమ్మాయిలు టైటిల్ పట్టేశారు
ABN , Publish Date - Nov 24 , 2025 | 06:24 AM
టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచిన భారత జట్టు.. అంధ మహిళల తొలి టీ20 వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలిచింది. ఓపెనర్ ఫులా సరెన్ (44 నాటౌట్), తెలుగమ్మాయి కరుణ కుమారి (42) రాణించడంతో...
అంధ మహిళల టీ20 వరల్డ్‌కప్ విజేత భారత్
అదరగొట్టిన ఫులా సరెన్, కరుణ
ఫైనల్లో 7 వికెట్లతో నేపాల్ చిత్తు
కొలంబో: టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచిన భారత జట్టు.. అంధ మహిళల తొలి టీ20 వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలిచింది. ఓపెనర్ ఫులా సరెన్ (44 నాటౌట్), తెలుగమ్మాయి కరుణ కుమారి (42) రాణించడంతో.. ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొన్న భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నియంత్రించింది. దీంతో నేపాల్ జట్టు 20 ఓవర్లలో 114/5 స్కోరు మాత్రమే చేసింది. బ్యాటర్లను బౌలర్లు కట్టడి చేయగా.. ఫీల్డర్లు అద్భుతంగా రాణిస్తూ ప్రత్యర్థి నేపాల్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ఇన్నింగ్స్ మొత్తంలో నేపాల్ ఒకే ఒక బౌండ్రీ సాధించిందంటే భారత ఫీల్డర్లు ఎంత అద్భుతంగా బౌల్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఛేదనలో భారత్ 12.1 ఓవర్లలో 3 వికెట్లకు 117 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సరెన్ ఎడాపెడా షాట్లలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంతో భారత్ 10 ఓవర్లలో సెంచరీ మార్క్ దాటింది. 13వ ఓవర్ తొలి బంతిని ఫైన్ లెగ్ మీదుగా ఫోర్ బాదిన సరెన్ మ్యాచ్‌ను ఫినిష్ చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా సరెన్ నిలిచింది. సెమీ్‌సలో ఆస్ట్రేలియాను భారత్ ఓడించగా.. పాకిస్థాన్‌పై నేపాల్ గెలిచింది.

గెలుపులో పాడేరు మన్యం బిడ్డ
భారత జట్టు వరల్డ్‌కప్ సాధించడంలో తెలుగమ్మాయి పి.కరుణ కుమారి కీలక పాత్ర పోషించింది. ఫైనల్లో టాప్ స్కోరర్ ఫులా సరెన్ తర్వాత అత్యధిక పరుగులు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరుకు చెందిన కరుణ కుమారి గత రెండేళ్లుగా అంధుల క్రికెట్‌లో నిలకడగా రాణిస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ప్రభుత్వ బాలికల అంధుల రెసిడెన్షియల్ పాఠశాలలో కరుణ పదో తరగతి చదువుతోంది. కరుణ ప్రతిభను గుర్తించిన అర్జున అవార్డు గ్రహీత, కోచ్ అజయ్ కుమార్ రెడ్డి ప్రోత్సాహంతో ఆమెకు జాతీయ జట్టులో చోటు లభించింది. తనకు లభించిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకొంది.