India vs Pakistan Match: ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌పై ఏసీసీ క్లారిటీ..
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:51 PM
భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు. ఇది అభిమానులకు ఒక భావోద్వేగ పండుగ. అయితే 2025 ఆసియా కప్‌లో ఈ రెండు జట్ల మ్యాచ్ రద్దవుతుందని వచ్చిన ఊహాగానాలకు బ్రేక్ పడింది.

ఇండియా vs పాకిస్తాన్ (India vs Pakistan) ఆసియా కప్ 2025 మ్యాచ్‌పై ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, ఈ హై వోల్టేజ్ పోరాటం యధాతథంగా కొనసాగనుంది. ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియా-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆసియా కప్ సెప్టెంబర్ 14, 2025న యూఏఈలో జరగనున్న ఈ మ్యాచ్ రద్దు కాదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) స్పష్టం చేసింది.
ఎందుకు రద్దు కావడం లేదు?
ఇది ద్వైపాక్షిక సిరీస్ కాదని, అనేక దేశాల టోర్నమెంట్‌లో భాగంగా జరిగే మ్యాచ్ మాత్రమేనని ACC సభ్యులు తెలిపారు. ఇండియా గేమ్ నుంచి తప్పుకుంటే, పాకిస్తాన్‌కు నేరుగా వాక్‌ఓవర్ లభిస్తుందన్నారు. అది మిగతా జట్లకు అన్యాయంగా మారుతుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
తగ్గనున్న ఆదాయం..
ఈ టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అత్యధిక ప్రేక్షకాదరణ ఉంటుంది. దీనివల్ల మిగతా 24 ACC సభ్య దేశాలకు వచ్చే ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. సోనీ నెట్‌వర్క్ ఈ టోర్నమెంట్ ప్రసార హక్కులను 8 ఏళ్లకు USD 170 మిలియన్‌తో పొందింది. అందులో ప్రధాన భాగం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నుంచే వస్తుంది. కాబట్టి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ రద్దయ్యే అవకాశం లేదన్నారు.
ప్రభుత్వ అనుమతి ముందే
ఇండియా వేదికగా ఉన్నప్పటికీ, ఆసియా కప్ 2025 యూఏఈలో జరగనుంది. టోర్నమెంట్‌కు సంబంధించిన ప్రభుత్వ అనుమతి ముందే లభించిందని సమాచారం. క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవియా ఇటీవలే ప్రకటించినట్టు, ఆయా దేశాల ఈవెంట్‌లలో పాకిస్తాన్‌తో భారత్ ఆడతుందనే విషయం ఇప్పటికే స్పష్టమైందని తెలిపారు.
అధికారిక వర్గాల ప్రకారం..
ఇటీవల ఇంగ్లాండ్‌లో జరగాల్సిన ఇండియా-పాకిస్తాన్ లెజెండ్స్ మ్యాచ్‌ను సోషల్ మీడియా వ్యతిరేకత కారణంగా రద్దు చేశారు. దీంతో ఆసియా కప్ మ్యాచ్ కూడా రద్దవుతుందేమో అనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ అధికారిక వర్గాలు మాత్రం అందుకు అవకాశం లేదని స్పష్టం చేశాయి.
ఆసియా కప్ 2025 షెడ్యూల్
ఈ సారి ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది. ఇది టీ20 ఫార్మాట్‌లో ఉంటుంది. ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్‌లు గ్రూప్ Aలో ఉన్నాయి. ఈ రెండు జట్లు సూపర్ ఫోర్‌లో మళ్లీ తలపడే అవకాశం ఉంది. ఫైనల్‌లో కూడా ఇవే జట్లు తలపడితే మూడు వారాల్లో మూడు మ్యాచ్‌లు జరగచ్చన్న అంచనాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి