Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. మరో సూపర్ సెంచరీ!
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:18 PM
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 32 బంతుల్లో సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ సెంచరీలతో అదరగొడుతున్నాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బెంగాల్, పంజాబ్ మధ్య హైదరాబాద్ వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో అతడు 32 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. దీంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టపోయి 310 పరుగులు చేసింది. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనే ఇది రెండో అత్యధిక స్కోర్. ఓవరాల్‌గా టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్.
తొలుత టాస్ గెలిచిన పంజాబ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) 52 బంతుల్లో 148 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. రికార్డ్ స్థాయిలో 16 సిక్సులు, 8 ఫోర్లతో విరుచుపడ్డాడు. ప్రభు సిమ్రన్ సింగ్‌తో కలిసి అతడు మొదటి వికెట్‌కు 205 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రభు(70) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అన్‌మోల్ ప్రీత్ సింగ్(11) నిరాశ పర్చాడు. రమణ్‌దీప్ సింగ్(39), సన్విర్ సింగ్(22) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. నమన్ ధీర్(7), నేహాల్ వధేరా(2) నాటౌట్‌గా నిలిచారు. బెంగాల్ బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, షమీ, ప్రదీప్త ప్రమాణిక్, సాక్షైమ్ చౌదరి తలో వికెట్ పడగొట్టారు.
యువీ సరసన..
అభిషేక్ శర్మ తొలుత 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. తన మెంటార్, క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్(Yuvraj Singh) సరసన నిలిచాడు. టీ20 ప్రపంచ కప్ 2007లో యువీ 12 బంతుల్లోనే అర్ధ శతకం నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
రో-కో జోడీ రాహుల్‌కి బలం: బవుమా
విరాట్‌కు కలిసొచ్చిన కేఎల్ కెప్టెన్సీ.. సెంచరీ రిపీట్ అవ్వనుందా?