Aaron Finch: జట్టు సరైన కూర్పుతో ఉండాలి: ఆరోన్ ఫించ్
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:31 PM
ఆసీస్‌తో టీ20 మ్యాచ్‌ల్లో భారత క్రికెట్ మేనేజ్‌మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చలకు దారి తీశాయి. ఇటు బ్యాటింగ్ ఆర్డర్‌తో పాటు తుది జట్టులో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టీ20 (India vs Australia T20 Series)ల సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తవగా.. అందులో ఒకటి వర్షం కారణంగా రద్దు అయింది. మరొక మ్యాచ్‌లో టీమిండియా(Team India) పేలవ ప్రదర్శనతో ఓటమిపాలైంది. అయితే ఇక్కడ మేనేజ్‌మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చలకు దారి తీశాయి. ఇటు బ్యాటింగ్ ఆర్డర్‌తో పాటు తుది జట్టులో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh)ను బెంచ్‌కే పరిమితం చేయడంపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్(Aaron Finch) స్పందించాడు.
‘అర్ష్‌దీప్ సింగ్ కచ్చితంగా తుది జట్టులో ఉండాలి. కనీసం మూడో టీ20లో అయినా అతడిని తీసుకోవాలి. మరీ ఎక్కువగా బ్యాటర్లతోనే వెళ్లినా మ్యాచ్‌లు గెలవడం కష్టం. భారత్ కూడా ఇలా అదనంగా బ్యాటర్‌ను తీసుకుని ప్రయోగాలు చేస్తుంది. దీనికి కారణాలు ఏమైనా.. బౌలింగ్ విభాగం కూడా కీలకమే. మెగా టోర్నీలో గెలవాలంటే కేవలం బ్యాటింగ్‌తోనే సాధ్యం కాదు. సరైన కూర్పుతో బరిలోకి దిగాలి. రెండో టీ20లో టీమిండియా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. స్కోరు బోర్డుపై తగినన్ని పరుగులు లేవు కాబట్టి భారత బౌలర్లు తేలిపోయారు. ఇంకాస్త అదనంగా ఉండుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది.’ అని ఫించ్ వ్యాఖ్యానించాడు.
అభిషేక్ ఒంటరిగా పోరాటం..
‘అభిషేక్ శర్మ(Abhishek Sharma) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా సరే.. తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించాడు. అభిషేక్ శర్మ ఒంటరిగా పోరాడాడు కాబట్టే టీమిండియాకు ఆ స్కోరు అయినా వచ్చింది. అతడు స్ట్రైకింగ్ వచ్చినప్పుడు ఆసీస్ బౌలర్లకు కష్టంగా మారింది. అయితే కెప్టెన్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) మాత్రం అభిషేక్‌ను ఎక్కువ స్ట్రైకింగ్‌కు రాకుండా చేయడంలో సఫలమయ్యాడు. లేదా భారత్ ఇంకొన్ని పరుగులు చేసేది. అప్పుడు ఆసీస్‌కు లక్ష్య ఛేదన కాస్త క్లిష్టంగా మారేది’ అని ఫించ్ తెలిపాడు.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిశాయి. ఇందులో తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. రెండో టీ20లో భారత్ 125 పరుగులకు ఆలౌటైంది. అందులో అభిషేక్ శర్మ 68 పరుగులు చేయగా.. నంబర్ 7లో వచ్చిన హర్షిత్ రాణా 35 పరుగులు చేశాడు. ఇతర బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. అనంతరం ఈ టార్గెట్‌ను ఆసీస్ 13.2 ఓవర్లలో ఛేదించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. మూడో మ్యాచ్ ఆదివారం హోబర్ట్ వేదికగా జరగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
IND vs AUS: రెండో టీ-20.. గెలుపు ఆసీస్‌దే..
Sunil Gavaskar: అదే జరిగితే జెమీమాతో కలిసి పాడతా: గావస్కర్