Share News

Snakes: ఊరుఊరంతా.. ఏళ్లకు ఏళ్లుగా.. సర్పాలతో సావాసం

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:27 AM

ట్ఫాల్‌ గ్రామం... మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామం అది. మనం కుక్కలు, పిల్లులు, కోళ్లు, పశువులను ప్రేమతో పెంచుకున్నట్టు... అక్కడివారు సర్పాలను పెంచుకుంటారు. వాటిని స్వేచ్ఛగా తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తారు.

Snakes: ఊరుఊరంతా.. ఏళ్లకు ఏళ్లుగా.. సర్పాలతో సావాసం

పామును చూస్తేనే భయంతో ఆమడ దూరం పరిగెడతాం. కానీ ఓ ఊరుఊరంతా వాటితో ఏళ్లకు ఏళ్లుగా సావాసం చేస్తోంది. ఆ గ్రామంలోకి అడుగుపెడితే, మనుషుల కన్నా పాములే ఎక్కువగా కనిపిస్తాయి. ఇంతకీ ఎక్కడుందా గ్రామం? పాములతో ఆ పల్లెవాసులకి ఎందుకంత అనుబంధం??

షెట్ఫాల్‌ గ్రామం... మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామం అది. మనం కుక్కలు, పిల్లులు, కోళ్లు, పశువులను ప్రేమతో పెంచుకున్నట్టు... అక్కడివారు సర్పాలను పెంచుకుంటారు. వాటిని స్వేచ్ఛగా తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తారు. ఆ ఊరిలో ఎక్కడ చూసినా సర్పాల జాడలే. విశేషమేంటంటే.. ప్రతీ ఒక్కరు తమ ఇంట్లో పాము కోసం ప్రత్యేక స్థలం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ చోటును కుటుంబసభ్యులంతా దేవస్థానంగా భావిస్తారు. విచిత్రమేమిటంటే... చిన్నపిల్లలు కూడా ఏమాత్రం భయం, బెరుకు లేకుండా వాటితో ఆడుకుంటారంటే అతిశయోక్తి కాదు. కొన్నిసార్లు పాములు సమీపంలోని పాఠశాలకి వెళ్తుంటాయి. అయినాసరే ఉపాధ్యాయులు, విద్యార్థులు వాటిని చూసీ చూడనట్టుగానే ఉంటారు. అస్సలు కలవరపడరు. వందల ఏళ్లుగా పాములతో కలిసి జీవిస్తున్నా ఒక్కరు కూడా పాముకాటు వల్ల చనిపోలేదని గ్రామస్థులు చెబితే ఆశ్చర్యమేస్తుంది.


book7.2.jpg

దైవ స్వరూపంగా...

షెట్ఫాల్‌ గ్రామస్థులు సర్పాలను శివుని ప్రతీకగా భావిస్తారు. రోజూ పాలు పోసి, జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రమాదవశాత్తు ఏదైనా పాము చనిపోతే అంతిమ సంస్కారాలు చేస్తారు. పూర్వకాలం నుంచీ పాములను తమ కుటుంబసభ్యులుగా భావించి పూజిస్తున్నారట. చిన్నపిల్లలకు బాల్యంలోనే పాములను ఎలా పట్టుకోవాలి?, ఎలా సంరక్షించాలో తల్లిదండ్రులు నేర్పిస్తారట. ప్రేమ, ఆప్యాయత చూపిస్తే పాములు మనిషికి హాని తలపెట్టవని, అవి తమ రక్షకులని అక్కడి ప్రజల నమ్మకం.


book7.3.jpg

నాగులచవితి ఉత్సవాలు...

ఆ గ్రామంలో ఒక పురాతన నాగ దేవాలయం ఉంది. నిత్యం గ్రామస్తులు నాగదేవతని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. ముఖ్యంగా ఆ గుడిలో నాగులచవితి ఉత్సవాలు అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. భజనలు, ప్రత్యేక పూజలు చేస్తారు. ఉత్సవాలను తిలకించేందుకే సమీప గ్రామాలనుంచి వేలాది మంది భక్తులు ఆ రోజున షెట్ఫాల్‌ గ్రామానికి తరలివెళ్తారు. సర్పాలతో సావాసం చేస్తున్న అక్కడి ప్రజల ఆచారం విచిత్రంగా ఉన్నా.. అదే వారి గ్రామాన్ని ప్రత్యేకంగా నిలిపింది.

book7.4.jpg

Updated Date - Nov 02 , 2025 | 11:27 AM