Netherlands Statiegeld: డబ్బు సంపాదించే కొత్త టెక్నిక్..! క్యూ కట్టేస్తున్న జనాలు..
ABN , Publish Date - Jul 08 , 2025 | 03:19 PM
పర్యావరణాన్ని ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడేందుకు నెదర్లాండ్స్ సరికొత్త కిటుకు కనిపెట్టింది. దేశంలో ఎక్కడికక్కడ బాటిల్స్ డిపాజిట్ యంత్రాలను ఏర్పాటు చేసింది. అంతే.. ప్రజలు, పర్యాటకులు వీటి ముందు క్యూ కట్టేస్తున్నారు. పని కట్టుకుని ఎవరూ చెప్పకున్నా తమంతట తామే ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరేస్తూ గో గ్రీన్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

Bottle Deposit Machines Netherlands: ప్లాస్టిక్ వాడకం పర్యావరణాన్ని ఎంత భ్రష్టు పట్టిందో అందరికీ తెలుసు. అయినా, మన ప్రమేయం లేకుండానే నిత్యావసర వస్తువుల్లో భాగంగా కొనేస్తుంటాం. వీటిలో నూటికి తొంభై వంతు ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్లపైనా, నీటివనరుల్లోకి చేరిపోతుంటాయి. వీటిని అదేపనిగా కలెక్ట్ చేసి మరీ రీసైకిల్ చేయడమంటే దాదాపు అసాధ్యం. ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా నెదర్లాండ్ ఓ వినూత్న ఆలోచన చేసింది. దేశంలో ఎక్కడికక్కడ బాటిల్స్ డిపాజిట్ యంత్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఎవరైనా తమ దగ్గర ఉన్న ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్, కోక్ బాటిల్స్, అల్యూమినియం డబ్బాలు తదితర వ్యర్థాలను డిపాజిట్ చేస్తే చాలు. డబ్బు సంపాదించుకోవచ్చు.
గో గ్రీన్ విధానాన్ని ప్రోత్సహించేందుకు నెదర్లాండ్ 'స్టాటీగెల్డ్' అనే పేరుతో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది. దేశంలోని సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల వద్ద బాటిల్స్ డిపాజిట్ యంత్రాలను ఏర్పాటు చేసింది. ఈ మెషీన్లో ప్లాస్టిక్ బాటిల్స్, కోక్ బాటిల్స్, అల్యూమినియం డబ్బాలు డిపాజిట్ చేస్తే ఒక రసీదు వస్తుంది. దాన్ని క్యాష్‌గా మార్చుకోవచ్చు. అందుకు తగిన మొత్తాన్ని చెల్లిస్తారు లేదా ఏదైనా వస్తువు కొనేటప్పుడు డిస్కౌంట్ కోసం వాడుకోవచ్చు. ఈ వ్యర్థాలను అన్నింటిని తర్వాత రీసైక్లింగ్ ప్లాంట్లకు పంపిస్తారు. అక్కడ వాటిని శుభ్రం చేసి కరిగించి మళ్లీ కొత్త సీసాలు లేదా ప్యాకేజింగ్‌కు అనువుగా మారుస్తారు. ఈ పద్ధతి ద్వారా మెటీరియల్ , శక్తి, డబ్బు ఆదా కావడంతో పాటు ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
అంతేగాక, కొత్త ప్రదేశాలు లేదా బయటకు వెళ్లినపుడు ప్రజలు హైడ్రేటెడ్‌గా ఉండేందుకు సొంత బాటిళ్లను వెంట తీసుకెళ్లే అలవాటును ప్రోత్సహించాలనేది 'స్టాటీగెల్డ్' లక్ష్యం. ఈ విధానానికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. జనాలు ఈ మెషీన్ల ముందు క్యూ కట్టేస్తున్నారు. తమ దగ్గర ఉన్నవే కాక.. ఎక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ కనిపించినా పట్టుకొచ్చి ఈ యంత్రంలో డిపాజిట్ చేస్తున్నారు.
తాజాగా ఈ మెషీన్ ప్రత్యేకత చెబుతూ ఓ నెటిజన్ వీడియోను షేర్ చేశాడు. నిజంగా ఇదొక పర్యావరణ పరిరక్షణకు ఇదొక అద్భుతమైన ఆలోచన అంటూ పొగిడేశాడు. ఈ పద్ధతి వల్ల ఎవరూ స్క్రాప్ డీలర్లకు ఇవ్వడం, తిరిగి ఉపయోగించడం లేదా వీధుల్లోకి విసిరేయడం లాంటివి చేయరంటూ రాసుకొచ్చాడు. వీడియోలో ఓ పిల్లాడు సంచిలో ఉన్న బాటిళ్లను మెషీన్లో డిపాజిట్ చేశాక చివరగా ఓ రసీదు రావడం చూడవచ్చు.
ఇవీ చదవండి:
పీహెచ్‌డీ చేసినా డెలివరీ బాయ్‌గా జీవనం.. ఇతడి స్టోరీ తెలిస్తే..
నా కుటుంబాన్నే అవమానిస్తారా.. నెట్టింట డాక్టర్‌తో భారత్ చెస్ గ్రాండ్‌మాస్టర్ వాగ్వాదం