Groom Returns Dowry: వరుడికి రూ.5.51 లక్షల కట్నం! ఆ మరుక్షణం అతడు చేసింది చూసి..
ABN , Publish Date - Feb 18 , 2025 | 09:49 AM
పెళ్లిలో తనకు వధువు కుటుంబం ఇచ్చిన కట్నాన్ని ఓ వరుడు ఆ మరుక్షణమే తిరిగిచ్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ ఉదంతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ జమానా వచ్చినా కూడా దేశంలో ఇంకా పెళ్లిళ్లల్లో కట్నాలు ఇచ్చుకునే సంప్రదాయం కనిపిస్తోంది. అత్తింటి వారి కట్నాల వేధింపులు భరించలేక యువతులు ఇప్పటికీ నరకం అనుభవిస్తున్నారు. అయితే, మార్పు అనేది వ్యక్తిగత స్థాయిలో మొదలవ్వాలని బలంగా నమ్మిన ఓ యువకుడు తన అభ్యుదయ భావాలకి కార్యరూపం ఇచ్చి జనాల మన్ననలు పొందాడు. ఐఏఎస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న యువకుడి ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
రాజస్థాన్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. జైసల్మేర్‌కు చెందిన పరమ్‌వీరు రాథోడ్ ప్రస్తుతం సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇటీవలే అతడికి నికితా భాటీ అనే యువతితో ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. బ్యాండ్‌బాజా శబ్దాల నడుమ భారీ ఊరేగింపుగా పెళ్లి వేదికకు వచ్చిన అతడికి వధువు కుటుంబం గొప్ప స్వాగతం పలికింది (Viral).
Viral: పారాషూట్‌తో ఎగ్జామ్ సెంటర్‌లో దిగిన విద్యార్థి! ఎందుకో తెలిస్తే..
ఇక పెళ్లి సందర్భంగా వరుడికి తిలక ధారణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ క్రమంలో వధువు కుటుంబం అతడిపై కానుకల వర్షం కురిపించింది. అక్కడితో ఆగక ఎరుపు వస్త్రం పరిచిన ఓ ప్లేటులో ఏకంగా రూ.5.51 లక్షల నోట్ల కట్టలను తీసుకొచ్చి కట్నంగా ఇచ్చింది. ఇది వరుడికి అభ్యంతరకరంగా తోచినా అప్పటికి మౌనంగానే ఉండిపోయాడు. ఇక ప్లేట్‌లో అన్ని నోట్ల కట్టలను అక్కడున్న వారందరూ ఆసక్తిగా గమనించారు. పెళ్లి క్రతువు మొత్తం పూర్తయ్యాక వరుడు ఆ డబ్బు మొత్తాన్ని వరుడి కుటుంబానికి తిరిగిచ్చేశాడు.
‘‘వాళ్లు నాకు కట్నం ఇవ్వడం నాకు విచారం కలిగించింది. ఈ కాలంలో కూడా ఇలాంటి దురాచారాలు కనిపిస్తుండటం చూసి బాదేసింది. కానీ పెళ్లి తంతు మధ్యలో ఉండగా దాన్ని తిరస్కరించడం తప్పని భావించాను. ఆ తరువాత నా తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడాక వాటిని తిరిగిచ్చేందుకు నిర్ణయించాము’’
ఢిల్లీలో తరచూ భూకంపాలు.. కారణం ఇదేనంటున్న నిపుణులు!
‘‘నేను సివిల్స సర్వీసెస్‌కు సిద్ధమవుతున్నా. ఇందులో భాగంగా సమాజం గురించి ఎంతో అధ్యయనం చేశా. చదువుకున్న వారే మార్పును స్వాగతించపోతే ఎలా అని అనిపించింది. ఈ విషయంలో నలుగురికి ఆదర్శంగా ఉందామని అనిపించింది. నాకు కూడా ఓ చెల్లె ఉంది. నా అభిప్రాయంతో తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. ఈ దురాచారాలను రూపు మాపేందుకు ఎవరికి వారు నడుం కట్టకపోతే మార్పు రాదు’’ అని చెప్పాడు. అక్షరాస్యులు, విద్యావంతులే ఈ మార్పుకు శ్రీకారం చుట్టాలని అభిప్రాయపడ్డారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న యువకుడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇలాంటోళ్లు ఐఏఎస్‌లు అయితే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుందని కొందరు నెట్టింట కామెంట్ చేశారు.