TG Politics: జిల్లా రాజకీయాలను షేక్ చేస్తున్న ఫ్యామిలీ..!
ABN , Publish Date - Jul 03 , 2025 | 10:42 AM
అక్కడి అధికారపార్టీలో ప్రకంపనలు రేపిన ఆయన వ్యాఖ్యలపై రగడ చల్లారకముందే.. ఆయన కూతురు పెట్టిన సోషల్ మీడియా అకౌంట్ అప్‌డేట్ ఆ జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. అక్కడి నుంచి పోటీచేసే అభ్యర్థిని తానే అంటూ ..

వరంగల్, జులై 03: అక్కడి అధికారపార్టీలో ప్రకంపనలు రేపిన ఆయన వ్యాఖ్యలపై రగడ చల్లారకముందే.. ఆయన కూతురు పెట్టిన సోషల్ మీడియా అకౌంట్ అప్‌డేట్ ఆ జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. అక్కడి నుంచి పోటీచేసే అభ్యర్థిని తానే అంటూ ఆమె సోషల్ మీడియా అకౌంట్‌లో అప్‌డేట్ చేసుకున్నారు. ఇప్పటికే ఆమె తల్లిదండ్రుల మాటలతో తంటాలు పడుతున్న అధికార పార్టీకి కూతురు పెట్టిన పోస్ట్ మరో ఇబ్బందిగా పరిణమించింది. అయినా వారు డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఈ పరిణామం ఏ జిల్లాలో జరిగింది. ఏం పార్టీని ఇబ్బంది పడుతోంది.. స్పెషల్ స్టోరీ మీకోసం..
తెలంగాణ కాంగ్రెస్‌లో కాకరేపిన మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యవహారం ఇప్పుడు మరో అడుగు ముందుకు అన్న చందంగా సాగుతోంది. కొండా మురళీ చేసిన వ్యాఖ్యలపై సొంతపార్టీలో రాజకీయ దుమారం కొనసాగుతుండగానే.. ఆయన కూతురు కొండా సుష్మిత పటేల్ పొలిటికల్ ఎంట్రీ వరంగల్ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా వేడిపుట్టించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తానే పోటీచేయబోతున్నట్టు కొండా సుష్మితాపటేల్ ఆమె సోషల్ మీడియా అకౌంట్‌లో అప్‌డేట్ చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ రేవూరి ప్రకాశ్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే సుష్మిత ఎక్స్ అకౌంట్‌లో అస్పరింగ్ పరకాల ఎమ్మెల్యే అని మార్చుకోవడం వరంగల్ కాంగ్రెస్‌లో కొత్త రచ్చకు దారితీసింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కొండా దంపతులు తమ కుటుంబానికి రెండు టికెట్లు కావాలని అధిష్టానాన్ని కోరారు. ముందుగా సరే అన్న పార్టీ పెద్దలు.. తీరా ఎన్నికల ముందు ఒకే కుటుంబానికి రెండు టికెట్లు సాధ్యం కాదని.. కొండా సురేఖకు వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ కేటాయించారు. కొండా మురళీకి ఎమ్మెల్సీ ఇస్తామని అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారట. అయితే ఎన్నికలు ముగిసి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. కొండా మురళీకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. దీనికి తోడు జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటితో పొసగడం లేదట. పొంగులేటికి అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ ఒక్కటయ్యారు. వీరంతా కొండా ఫ్యామిలీకి వ్యతిరేక వర్గంగా మారిపోయారు. వీరంతా పార్టీ, ప్రభుత్వ పెద్దలకు తమపై తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని ఇటీవలే కొండా మురళీ వ్యాఖ్యానించడం రాజకీయ దుమారం రేపింది. తర్వాత గాంధీభవన్ వెళ్లిన కొండా మురళీ.. పార్టీ పెద్దలకు ఆరు పేజీల లేఖను రాసిచ్చారు. దాంట్లో వరంగల్ జిల్లా నేతలు తమ దంపతులపై ఎలాంటి కుట్రలు చేస్తున్నారో వివరించారు.
కొండా మురళీ లేఖపై, ఆయన గాంధీభవన్‌లో చేసిన వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కొండా మురళీని చూస్తే తమకు భయమేస్తోందంటూ మీడియాతో వ్యంగంగా మాట్లాడారు. తర్వాత కొండా దంపతుల వ్యతిరేక వర్గం ఎమ్మెల్యేలైన కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ మరోమారు అత్యవసరంగా సమావేశమయ్యారు. మురళీ తమపై చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. పార్టీ పెద్దలకు మరోసారి మౌఖిక ఫిర్యాదు చేశారట. అయితే తమ పరిశీలనలో ఉందని పార్టీ పెద్దలు చెప్పగానే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామన్నారు కొండా వ్యతిరేక వర్గ ఎమ్మెల్యేలు.
ఇలా కొండా మురళీ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతుండగానే.. ఆయన కూతురు కొండా సుష్మితాపటేల్ ఎంట్రీ ఇచ్చారు. పరకాల నియోజకవర్గానికి ‘నేనే ఎమ్మెల్యే అభ్యర్థి’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ బయోను అప్‌డేట్ చేశారు. సుష్మిత చేసిన ఈ అప్డేట్ వరంగల్ కాంగ్రెస్‌లో చర్చానీయంశంగా మారింది. పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకే చెందిన రేవూరి ప్రకాశ్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే ఇటీవల కొండా మురళీ రేవూరిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 75ఏళ్ల ముసలోడు నాకాళ్లు పట్టుకుంటే పరకాల నుంచి గెలిపించానని.. తర్వాత తనకు వ్యతిరేకంగా ఆయన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల దుమారం చల్లారకముందే కొండా సుష్మిత పరాకలకు ఎంట్రీ ఇస్తున్నానని సంకేతాలు ఇవ్వడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. కొండా దంపతుల కుమార్తె ఎంట్రీతో.. వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మరింత అలజడి వాతావరణం పెరిగింది. మరో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కొండా సుస్మితా పటేల్.. ఫుల్ టైమ్ రాజకీయాల్లో అలర్ట్ ఉంటే ఎలా ఉంటుందోనని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై వరంగల్ కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్టాండ్ తీసుకుంటారోనని రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.