Share News

‘విశ్రాంత’ వీసా

ABN , Publish Date - Feb 16 , 2025 | 07:16 AM

మనిషి జీవనయానంలో ఎన్నో మజిలీలు. ఉద్యోగ విరమణ అయిన తర్వాత గడిపే కాలాన్ని ‘గోల్డెన్‌ ఇయర్స్‌’ అంటారు. ఎందుకంటే ఆదరాబాదరా లేకుండా, ప్రతీ నిమిషాన్ని ఆస్వాదిస్తూ, తమకోసం తాము జీవించే బంగారు కాలం అదే కాబట్టి. గోల్డెన్‌ ఇయర్స్‌లో ఉన్నవారికి ‘రిటైర్మెంట్‌ వీసా’ ఇస్తామంటూ ఆహ్వానిస్తున్నాయి కొన్ని దేశాలు. సోషల్‌ మీడియాలో ఇప్పుడిదో ట్రెండ్‌.

‘విశ్రాంత’ వీసా

మనిషి జీవనయానంలో ఎన్నో మజిలీలు. ఉద్యోగ విరమణ అయిన తర్వాత గడిపే కాలాన్ని ‘గోల్డెన్‌ ఇయర్స్‌’ అంటారు. ఎందుకంటే ఆదరాబాదరా లేకుండా, ప్రతీ నిమిషాన్ని ఆస్వాదిస్తూ, తమకోసం తాము జీవించే బంగారు కాలం అదే కాబట్టి. గోల్డెన్‌ ఇయర్స్‌లో ఉన్నవారికి ‘రిటైర్మెంట్‌ వీసా’ ఇస్తామంటూ ఆహ్వానిస్తున్నాయి కొన్ని దేశాలు. సోషల్‌ మీడియాలో ఇప్పుడిదో ట్రెండ్‌.

మనదేశం నుంచి ఇతర దేశాల్లోకి అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి. వీటిల్లో టూరిస్టు వీసా, స్టడీ వీసా, వర్క్‌ వీసా, బిజినెస్‌ వీసా వంటివి చాలానే ఉన్నాయి. ఇప్పుడు ‘రిటైర్మెంట్‌ వీసా’ ఈ లిస్ట్‌లో చేరింది. క్రమక్రమంగా ఈ వీసా మీద ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ‘ఇంతకాలం ఇల్లు, పిల్లలు, ఆఫీసు, టాస్కులు, బాక్సులు, ఫీజులు... ఇలా ఎన్నో టెన్షన్లతో జీవితం గడిచింది. ఇప్పుడు రిటైరయ్యా. బాధ్యతలు తీరాయి. ఏ బాదరబందీ లేకుండా అందమైన పరిసరాల్లో ప్రశాంతంగా జీవించాలని ఉంద’ని అంటున్న సీనియర్‌ సిటిజన్ల సంఖ్య పెరుగుతోంది.


మా దేశానికి రండి...

‘విశ్రాంత వీసా’ను మారిషస్‌, కోస్టారికా, ఈక్వెడార్‌, ఇండోనేషియా, ఐర్లాండ్‌, మెక్సికో, పనామా, పోర్చుగల్‌, స్పెయిన్‌, థాయిలాండ్‌ తదితర దేశాలు ఇస్తున్నాయి. ఈ వీసాకి కొన్ని షరతులు లేకపోలేదు. అవేమిటంటే...

- 50 లేదా 55 వయసు పైబడినవాళ్లే అర్హులు.

- స్థిరమైన ఆదాయమార్గాలు చూపించాలి. పెన్షన్‌, అద్దెలు, సేవింగ్స్‌ మొదలైనవి.

- ఆతిథ్య దేశంతో సంబంధం లేకుండా స్వదేశంలో ఆరోగ్య బీమా ఉండాలి.

- నేర నేపథ్యం ఉండకూడదు.

- నివాసం ఉండాలనుకునే నగరం, ఇంటి వివరాలు ముందుగా తెలియజేయాలి.


book1.2.jpg

- కొత్త దేశంలో ఎలాంటి ఉద్యోగాలూ చేయకూడదు. కేవలం సేదతీరడానికే వస్తున్నట్టుగా ప్రకటించాలి. అందుకే ఈ వీసాను ‘చిల్‌ వీసా’ అని కూడా పిలుస్తారు.

- ఇంచుమించుగా అన్ని దేశాలు ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి. ‘ఒకరకంగా రిటైర్మెంట్‌ వీసా చక్కని ఆలోచనే’ అని అంటున్నాయి ట్రావెల్‌ కంపెనీలు.


ఎందుకంటే...

- మన మెట్రోపాలిటన్‌ నగరాల్లో కంటే కొత్త దేశంలో జీవన వ్యయం తక్కువగా ఉంటుంది. కాబట్టి సీనియర్‌ సిటిజన్స్‌ నాణ్యమైన జీవనాన్ని విదేశాల్లో పొందవచ్చు.

- అభిరుచిని బట్టి బీచులు, లోయప్రాంతాలు, చారిత్రక ప్రదేశాల్లో కొన్ని నెలల పాటు నివాసితుల్లా గడపొచ్చు.

- మారిషస్‌ లాంటి దేశాలు గ్లోబల్‌ ఇన్‌కమ్‌ మీద పన్నులు విధించడం లేదు. సీనియర్‌ సిటిజన్స్‌కు ఇది చక్కటి అవకాశం.


- కొత్త వాతావరణం, సంస్కృతులు, రుచులను తెలుసుకుంటూ గడపడం వల్ల జీవితాన్ని కొంగొత్తగా మొదలుపెట్టినట్టే అవుతుంది. రిటైరయ్యాక వచ్చే డిప్రెషన్‌ తగ్గుతుంది.

అయితే వచ్చిందే అవకాశం అంటూ వెంటనే దూకేయకుండా అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. మొదటగా ఎంచుకున్న కొత్త దేశంలో ఓ వారం రోజులపాటు టూరిస్టుగా గడిపి రావడం మంచిది. ఏ దేశంలో ఉండాలనుకుంటున్నామో అక్కడి భాషను కాస్తయినా నేర్చుకుంటే అన్ని రకాలుగా ఉపయోగం. అలాగే దరఖాస్తు చేసేముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి. పూర్తి సానుకూలత లభిస్తేనే రిటైర్మెంట్‌ మజిలీకి జై అనాలి.


ఆదాయం ముఖ్యం...

- రిటైర్మెంట్‌ వీసాతో థాయిలాండ్‌లో గడపాలంటే అక్కడి బ్యాంకులో

19 లక్షల రూపాయలు డిపాజిట్‌ చేయాలి. లేకపోతే నెలనెలా లక్షన్నర రూపాయల ఆదాయం ఉన్నట్టుగా చూపించాలి.

- మారిషస్‌లో రూ.15 లక్షలు డిపాజిట్‌ చేయాలి.

- పోర్చుగల్‌లో నెలనెలా 80 వేల రూపాయల ఆదాయం ఉన్నట్టుగా చూపించాలి.

సాధారణంగా రిటైర్మెంట్‌ వీసాతో ఏడాది పాటు ఉండవచ్చు. తర్వాత ఆ కాలాన్ని పెంచుకోవచ్చు.

Updated Date - Feb 16 , 2025 | 07:16 AM