Diwali Celebrations: తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబురాలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 07:44 AM
రాజధాని మెట్రో ప్రాంతం వేదికగా, తెలుగు భాష, కళా,సంస్కృతీ వారసత్వ పరంపరను స్వర్ణోత్సవ సంస్థ బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం కొనసాగిస్తోంది. ఈ సంవత్సరం దీపావళి సంబరాలు సుమారు 1500 మంది ప్రవాస భారతీయుల మధ్య కోలాహలంగా నిర్వహించింది.
రాజధాని మెట్రో ప్రాంతం వేదికగా, తెలుగు భాష, కళా, సంస్కృతీ వారసత్వ పరంపరను స్వర్ణోత్సవ సంస్థ బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Washington Telugu Cultural Association) కొనసాగిస్తోంది. ఈ సంవత్సరం దీపావళి సంబరాలు (Diwali Celebrations) సుమారు 1500 మంది ప్రవాస భారతీయుల మధ్య కోలాహలంగా నిర్వహించింది. ప్రముఖ గాయని సునీతతో వర్ణం బ్యాండ్ వారు 'సువర్ణ' భరితంగా, స్వర రంజితంగా అందించిన విభావరి యువతను, చిన్నారులను ఉర్రూతలూగించింది. సాయికాంత దీపావళి ప్రత్యేక గీతం మహిళలు, పెద్దలను విశేషంగా ఆకట్టుకుంది. సంస్థ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

సాయంత్రం 4:00 గంటల నుంచే మొదలైన ఈ వేడుకల్లో... పండుగ దుస్తుల్లో చిన్నారులు, మహిళలు విచ్చేసి సందడి చేశారు.. విఘ్నేశ్వరుడి పూజతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నారుల సంప్రదాయ నృత్య, కళాభినయంతో ఈ కార్యక్రమం కొనసాగింది. అర్ధరాత్రి వరకూ అతిథులు, సంగీత తార తోరణంతో ఆనాటి ఆ పాత మధురాలను గుర్తుచేసుకున్నారు. యువత ఉత్సాహ కేరింతల మధ్య.. పసందైన తెలుగింటి భోజనంతో సుమారు రాత్రి 1:00 గంట వరకూ కోలాహలంగా ఈ కార్యక్రమం కొనసాగింది.

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు రవి అడుసుమిల్లి మాట్లాడుతూ.. 51 ఏళ్ల క్రితం తెలుగు వారిని ఏకం చేసే వేదిక కోసం ఆనాడు కొందరు పెద్దల ఔదార్యం, సహకారంతో మొదలైన ఈ సంస్థకు వెన్నుదన్నుగా నిలిచిన దాతలకు, పెద్దలకు, సంస్థ శ్రేయోభిలాషులకు, పూర్వ అధ్యక్షులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సభికులందరికీ దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు కార్యవర్గాన్ని పలువురు ప్రశంసించారు. మూడు దశాబ్దాలుగా తెలుగు వారిని అలరిస్తున్న గాయని సునీతని సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత కార్యవర్గ సభ్యులు, తానా, ఆటా స్థానిక ప్రాంతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి
పాకిస్థానీలకు 59 రోజుల్లో కెనడా వీసా దరఖాస్తు ప్రాసెసింగ్.. భారతీయులకు మాత్రం..
ఖతర్‌లో ఆత్మీయత, ఆప్యాయతల మధ్య ఆంధ్ర కళా వేదిక కార్తీక వనభోజనాలు