Youthful Skin: యవ్వన చికిత్సలు ఆచితూచి
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:32 AM
సౌందర్య చికిత్సలన్నీ ప్రమాదకరమైనవి కావు. నిజానికి తగిన అర్హతలు, అనుభవం, సామర్థ్యం ఉన్న వైద్యుల పర్యవేక్షణలో ఈ చికిత్సలతో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు.

సౌందర్య చికిత్సలన్నీ ప్రమాదకరమైనవి కావు. నిజానికి తగిన అర్హతలు, అనుభవం, సామర్థ్యం ఉన్న వైద్యుల పర్యవేక్షణలో ఈ చికిత్సలతో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. పైబడే వయసుతో ముఖంలో చోటుచేసుకునే మార్పులను సరిదిద్దడానికి పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. యాంటీ ఏజింగ్‌లో భాగంగా ‘గ్లూటాథయాన్’ అనే ఇంజెక్షన్‌తో వైటెనింగ్ ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు, యాంటీఆక్సిడెంట్లు కూడా తీసుకోగలిగితే, ఫలితం మెరుగ్గా ఉంటుంది. వీటితో పాటు ముఖం మీద వృద్ధాప్య ఛాయలను దూరం చేయడం కోసం స్కిన్ హైడ్రేషన్, ఫిల్లర్స్, కొల్లాజెన్ స్టిమ్యులేటర్స్, బొటాక్స్ లాంటివి అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవన్నీ పరిమితి మేరకు వాడుకున్నప్పుడే సహజసిద్ధ ఫలితం సొంతమవుతుంది. ఉదాహరణకు గ్లుటాథయాన్ తీసుకున్నప్పుడు, చర్మం తెల్లబడడంతో పాటు, నునుపుదనం పెరుగుతుంది. అయితే వైద్యులు సూచించిన మోతాదుకు మించి తీసుకుంటే, కచ్చితంగా దుష్ప్రభావాలను భరించవలసి ఉంటుంది.
గ్లూటాథయాన్ సురక్షితమే!
ఈ మందు మాత్రలు, ఇంజెక్షన్ల రూపంలో దొరుకుతుంది. అయితే మాత్రలతో పోలిస్తే, ఇంజెక్షన్లు మెరుగైన ఫలితాన్నిస్తాయి. ఇంజెక్షన్ కూడా సెలైన్ ద్వారానే ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఇంజెక్షన్ ప్రభావం నాలుగు నుంచి ఐదు వారాల పాటు ఉంటుంది. తర్వాత కూడా నెలకు ఒకటి లేదా రెండు ఇంజెక్షన్లు తీసుకోగలిగితే, అదే ఫలితం మరికొంత కాలం కొనసాగుతుంది. వీటిని తీసుకోవడం మానేస్తే, రెండు మూడు నెలల్లో పూర్వపు స్థితికి చేరుకుంటారు. కాబట్టి యవ్వనంగానే కనిపించాలని కోరుకునే వారు, వైద్యుల పర్యవేక్షణలో వాళ్లు సూచించినంత కాలం ఈ ఇంజెక్షన్లు తీసుకోవచ్చు. వీటిని క్రమం తప్పక తీసుకున్నప్పుడు, రెండు నుంచి మూడు రెట్లకు చర్మపు రంగు మెరుగుపడుతుంది. 16 ఏళ్లు దాటిన యువతులు, 17 ఏళ్లు దాటిన యువకులు ఈ ఇంజెక్షన్లు తీసుకోవచ్చు. అయితే గ్లూటాథయాన్ ఇంజెక్షన్లను సరిపడా మోతాదులో, సరైన పద్ధతిలో తీసుకోలేకపోతే, ఫలితం ఉండదు. ఈ ఇంజెక్షన్ ఇవ్వడానికి కూడా కొన్ని నియమాలు పాటించాలి. దీని కంటే ముందు శరీరాన్ని సిద్ధం చేయడం కోసం, 45 నిమిషాల పాటు విటమిన్ సి, విటమిన్ బి6 లాంటి పోషకాలతో ఐవి అందించి, ఆ తర్వాతే గ్లూటాథయాన్‌ను సెలైన్ ద్వారా ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ ఔషధాన్ని శరీరం శోషించుకుని, సమర్థంగా వినియోగించుకోగలుగుతుంది. అలాగే సెలైన్‌ను ముదురు రంగు వస్త్రంతో కప్పవలసి ఉంటుంది. లేదంటే ఔషథ ప్రభావం సన్నగిల్లుతుంది.
పలు రకాల చికిత్సలతో...
పైబడే వయసు సూచనలను తగ్గించుకుని, యవ్వనంగా కనిపించడం కోసం సమతులాహారం తీసుకోవడంతో పాటు కంటి నిండా నిద్రపోవాలి. అయినప్పటికీ వాతావరణ కాలుష్యం, శరీరంలోకి చేరుకునే రసాయనాల వల్ల 30 ఏళ్లకే చర్మం రంగు తగ్గడం, ఎగుడుదిగుడుగా మారడం లాంటి మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. చర్మం బిగుతుగా ఉన్నప్పుడే యవ్వనంగా కనిపిస్తాం. కాబట్టి అందుకోసం చర్మ తత్వం ఆధారంగా మాయిశ్చరైజర్ వాడుకోవచ్చు. అలాగే చర్మం మీద మృత పొర తొలగకపోయినా, చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ పొర తొలగిపోవడం కోసం విటమిన్ ఎ కలిగిన రెటినాల్‌ను మూడు నుంచి ఆరు నెలల పాటు వాడుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే పైబడే వయసులో వేధించే మరొక సమస్య, మంగు. మంగులో, మెలాస్మా సమస్య సర్వసాధారణం. దీన్ని తొలగించడం కోసం లేజర్‌తో పాటు, ముఖ చర్మంలోకి ఇంజెక్షన్లు, పైపూత మందులు వాడుకోవచ్చు. వీటిలో పైపూత మందులు అంతగా ప్రభావాన్ని కనబరచవు. కంటి కింద నలుపు, వలయాలకు పిగ్మెంట్ కారణమైతే, అందుకు తగిన చికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. కొందరికి సన్నని గీతలు ఏర్పడి చర్మం కుంచించుకుపోయి, ఆ కారణంగా కంటి కింద నలుపు ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రదేశంలోని చర్మం ఉబ్బినట్టు కనిపించడం కోసం బూస్టర్లను అందించవలసి ఉంటుంది. ఈ బూస్టర్లు, శరీరంలోని నీటిని పీల్చుకుని ఉబ్బినట్టుగా మారి చర్మపు నలుపు తగ్గుతుంది.
సాగిన చర్మం కోసం...
సాగిన చర్మాన్ని పైకి లాగి, బిగుతును పెంచే చికిత్సలు కూడా ఉన్నాయి. ఇందుకోసం థ్రెడ్స్ ఉపయోగిస్తారు. ప్రస్తుతం చర్మంలోకి చొప్పించి, వాటిని అలాగే వదిలేసే థ్రెడ్స్ కూడా అందుబాటులోకొచ్చాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి కాబట్టి చర్మం బిగుతును సంతరించుకుంటుంది. డీప్ ప్లేన్ ఫేస్‌లిఫ్ట్, ఎండోస్కోపీ ఫేస్ లిఫ్ట్ అనే ఆధునిక చికిత్సలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటితో మచ్చలు తక్కువ, ప్రభావం ఎక్కువ. ఈ ప్రభావం దీర్ఘకాలం పాటు నిలిచి ఉంటుంది. కొద్ది మేరకు ముఖ చర్మం సాగిన వారికి ఈ చికిత్సతో అద్భుతమైన ఫలితం సాధించవచ్చు. ఎక్కువ సాగిన వారికి వరుస చికిత్సలు అవసరమవుతాయి. చర్మం ఉపరితలం అడుగున చేసే చికిత్సల తదనంతరం నాలుగైదు రోజుల పాటు చర్మాన్ని రుద్దుకోకుండా ఉండాలి. అలాగే సన్‌స్ర్కీన్ వాడుకోవాలి. లేజర్ చికిత్స తీసుకున్నప్పుడు ఏడు నుంచి పది రోజుల పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ క్రీమ్స్, మాయిశ్చరైజర్లు వాడుకోవాలి. థ్రెడ్ లిఫ్ట్ చికిత్స తదనంతరం ఐదు నుంచి ఏడు రోజులు చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఫేస్ లిఫ్ట్ సర్జరీ తదనంతరం మూడు నుంచి ఐదు వారాల పాటు జాగ్రత్తగా ఉండాలి.
చవక బేరం ప్రమాదమే!
ఆన్‌లైన్‌లో ఒక వస్తువు కొనేటప్పుడు రివ్యూలు చదివి, ఒకటికి నాలుగు వెబ్‌సైట్లు చూసి, నమ్మకం కుదిరిన తర్వాతే కొనుగోలు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు శరీరంలో అత్యంత ముఖ్య భాగమైన ముఖాన్నే వాళ్ల చేతుల్లో పెట్టేటప్పుడు, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. సౌందర్య చికిత్సల విషయంలో రాజీ పడిపోవడం సరి కాదు. చవకలో దొరికే చికిత్సల ప్రభావం తక్కువగా ఉండడమే కాకుండా, వాటిలో ఉపయోగించే ముడి పదార్థాలు నాసిరకానికి చెందినవి కావడంతో, దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి చికిత్స అందించే అర్హతలు, అదనపు శిక్షణ, అనుభవం, పరిజ్ఞానం ఉన్న డెర్మటాలజి్‌స్టలు, ప్లాస్టిక్ సర్జన్‌లను మాత్రమే ఎంచుకోవాలి.
చర్మపు బిగుతు
చర్మపు బిగుతును తాత్కాలికంగా పెంచే మిషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రో నీడ్లింగ్ ఈ కోవకు చెందినవే! ఇవి చర్మపు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, నునుపును పెంచుతాయి. దాంతో చర్మం సాగే తత్వం కొంత కాలం పాటు వాయిదా పడుతుంది.
ఆరోగ్యంగా ఉంటే, యవ్వనంగా కనిపిస్తాం! కాబట్టి సహజసిద్ధంగా ఆరోగ్యంగా ఉంచే ఆహారశైలి,జీవనశైలి అనుసరించాలి. సమతులాహారం, వ్యాయామం చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. శాకాహారులు యవ్వనంగా కనిపించడమే కాకుండా, ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనాల్లో రుజువైంది. కాబట్టి మాంసాహారాన్ని పరిమితం చేయాలి. పీచు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే చర్మ రక్షణ చేపట్టాలి. అందుకోసం ఉపయోగించే ఉత్పత్తులు నాణ్యమైనవి అయి ఉండాలి. చవక ఉత్పత్తులకు బదులుగా సురక్షితమైన ఉత్పత్తులకు ప్రాథాన్యం ఇవ్వాలి. రాత్రివేళ చర్మాన్ని శుభ్రపరుచుకుని, మాయిశ్చరైజర్లతో తేమగా ఉంచుకోవాలి. సన్‌స్ర్కీన్స్‌తో ఎండ నుంచి చర్మాన్ని రక్షించుకోవాలి.
డాక్టర్ సుధాకర్ ప్రసాద్
సీనియర్ కన్సల్టెంట్ కాస్మటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ,
అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్,
హైదరాబాద్.