Disclosure of AI: వీడియోల్లో ఏఐ కంటెంట్ ఉంటే స్పష్టం చేయాల్సిందే
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:22 AM
ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో సృష్టించిన వీడియోలు, ఆడియోలు యూట్యూబ్‌లో ఎక్కువయ్యాయి.

15 నుంచి యూట్యూబ్ కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ, జూలై 10: ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సృష్టించిన వీడియోలు, ఆడియోలు యూట్యూబ్‌లో ఎక్కువయ్యాయి. ఈ వీడియోలు నిజమైనవో కాదో చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ జనరేటెడ్ వీడియోల కట్టడికి యూట్యూబ్ చర్యలు తీసుకుంది. ఇకపై క్రియేటర్లు తమ వీడియోల్లో ఏఐ జనరేటెడ్ వాయి్‌సలు, ముఖాలు లేదా వీక్షకులను తప్పుదారి పట్టించే విజువల్స్ ఉంటే ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించాలని, లేదంటే వారి వీడియోలను తొలగించడం కానీ, డీమానిటైజేషన్ చేయడంగానీ చేస్తామని వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఏఐతో కూడిన విస్తృత కంటెంట్ వల్ల... ఆలోచనాత్మకమైన, అసలైన కంటెంట్‌ను కోల్పోకుండా చూసేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు యూట్యూబ్ వెల్లడించింది. పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. అయితే.. వీడియోలో కనిపిస్తూ.. సొంత స్వరంతో మాట్లాడుతూ.. తమ ఆలోచనలను, క్రియేటివిటీని వీడియోలోకి తీసుకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని పేర్కొంది. ఏఐని సహాయక సాధనంగా ఉపయోగించే వారిని కూడా లక్ష్యంగా చేసుకోవడం లేదని యూట్యూబ్ స్పష్టం చేసింది.