Share News

Xi Jinping: జిన్‌పింగ్‌ శకం ముగిసిందా?

ABN , Publish Date - Jul 03 , 2025 | 03:52 AM

చైనాలో గత 12 ఏళ్లుగా తిరుగులేని నాయకుడిగా ఉన్న షీ జిన్‌పింగ్‌ తన ప్రాభవం కోల్పోతున్నారా? అధికారాలు క్రమంగా ఆయన చేజారుతున్నాయా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Xi Jinping: జిన్‌పింగ్‌ శకం ముగిసిందా?

  • కొన్ని రోజులుగా అధికారిక కార్యక్రమాల్లో కనిపించని చైనా అధినేత

  • ప్రభుత్వ మీడియాలోనూ మాయం

  • బ్రిక్స్‌ సదస్సుకు ఆయన బదులు ప్రధాని

  • జిన్‌పింగ్‌ను పక్కనపెట్టారంటూ ఊహాగానాలు.. హ్యూ జింటావో హస్తం?

వాషింగ్టన్‌, జూలై 2: చైనాలో గత 12 ఏళ్లుగా తిరుగులేని నాయకుడిగా ఉన్న షీ జిన్‌పింగ్‌ తన ప్రాభవం కోల్పోతున్నారా? అధికారాలు క్రమంగా ఆయన చేజారుతున్నాయా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బ్రెజిల్‌లోని రియోడీజెనిరోలో ఈ నెల 5-8 తేదీల మధ్య జరిగే 17వ బ్రిక్స్‌ సదస్సుకు జిన్‌పింగ్‌ హాజరు కావటం లేదని, ఆయన బదులుగా ప్రధాని లీ క్వియాంగ్‌ హాజరవుతారని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి బుధవారం మీడియాకు వెల్లడించారు. జిన్‌పింగ్‌ రాకపోవటానికి కారణాలేమిటన్న విలేకర్ల ప్రశ్నలకు ఆమె స్పందించలేదు. జిన్‌పింగ్‌ 2013లో చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ప్రతి ఏటా బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతూ వచ్చారు. ఈసారి మాత్రమే ఆయన గైర్హాజరు అవుతున్నారు. అంతేకాదు, కొన్ని రోజులుగా జిన్‌పింగ్‌ చైనాలో బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. దాదాపు ప్రతి రోజూ మొదటిపేజీలో జిన్‌పింగ్‌ ఫొటోలతో వార్తలు ప్రచురించే ప్రభుత్వ పత్రిక పీపుల్స్‌ డైలీలో ఈ మధ్య ఆయన వార్తలుగానీ, ఫొటోలుగానీ కనిపించటం లేదు. చైనాకు వస్తున్న విదేశాల అధినేతలకు, ప్రతినిధులకు చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ)కి చెందిన సీనియర్‌ నేతలు ఆతిథ్యం ఇస్తున్నారే తప్ప జిన్‌పింగ్‌ జాడ లేదు. జూన్‌ తొలివారంలో.. చైనాకు బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో వచ్చినప్పుడు ఆయనతో జిన్‌పింగ్‌ సమావేశయ్యారు కానీ, ఈ తరహా ద్వైపాక్షిక సమావేశాల సందర్భంగా కనిపించే ఆర్భాటం మచ్చుకైనా లేదు. ఈ సమావేశంపై బెలారస్‌ అధ్యక్ష ప్రెస్‌ సర్వీస్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సదరు భేటీలో జిన్‌పింగ్‌ అలసటతో ఉన్నట్లుగా కనిపించారని తెలిపింది. ఇటీవల జిన్‌పింగ్‌ వ్యక్తిగత భద్రత సిబ్బందిని సగానికి తగ్గించారు. ఆయన తండ్రి స్మారకస్థలానికి ఇప్పటి వరకూ ఉన్న అధికారిక హోదాను తొలగించారు. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జిన్‌పింగ్‌ ఫోన్‌లో సంభాషించారన్న వార్తను చైనా ప్రభుత్వ టీవీ ఇటీవల ప్రసారం చేస్తూ.. జిన్‌పింగ్‌ పేరు ముందు ఎటువంటి హోదా ను పేర్కొనకపోవటం విశేషం. ఇవన్నీ చూసి, చైనా లో ఏదో జరుగుతోందని విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జిన్‌పింగ్‌ను పేరుకే అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నప్పటికీ.. అధికారాలు ఆయన చేతుల్లో లేకపోవచ్చని చెబుతున్నారు. సర్వాధికారాలు చెలాయించిన వారిని నిశ్శబ్దంగా పక్కనపెట్టి, వారి స్థానంలో మరొకరిని తీసుకొచ్చే సంప్రదాయం చైనా కమ్యూనిస్టు పార్టీలో ముందునుంచీ ఉంది. ప్రస్తుతం జిన్‌పింగ్‌ విషయంలో అదే జరుగుతున్నట్లు ఉండవచ్చని విశ్లేషకుల అంచనా.


పగ్గాలు ఎవరికి?

ఈ నేపథ్యంలోనే, జిన్‌పింగ్‌ స్థానంలో పగ్గాలు చేపట్టేదెవరు అన్న దానిపైనా ఊహాగానాలు నడుస్తున్నాయి. చైనాలో అత్యంత శక్తిమంతమైన ‘సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌’లో ఫస్ట్‌ వైస్‌ చైర్మన్‌గా ఉన్న జనరల్‌ ఝాంగ్‌ యూక్సియా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం అత్యున్నత అధికారాలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయని అంటున్నారు. ఆయనకు కమ్యూనిస్టు పార్టీలోని సీనియర్లు, మాజీ అధ్యక్షుడు హ్యూ జింటావో వర్గం మద్దతిస్తోందని సమాచారం. 2022లో సీపీసీ మహాసభల నుంచి జింటావోను(ఆయన ఆరోగ్యం బాగా లేదనే సాకుతో) అవమానకర రీతిలో బయటకు పంపించివేశారు. బహిరంగంగా జరిగిన ఈ ఘటనను యావత్‌ ప్ర పంచం చూసింది. పార్టీలో, ప్రభుత్వంలో తన ఏకఛత్రాధిపత్యం కోసమే జిన్‌పింగ్‌ ఈ పని చేయించార ని అప్పట్లో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పు డు అదే జింటావో చక్రం తిప్పుతున్నారని, జిన్‌పింగ్‌ను పక్కకు తప్పించే వ్యూహం ఆయనదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సైన్యంలో జిన్‌పింగ్‌కు మద్దతుదారులుగా ఉన్న పలువురు జనరల్స్‌ను కీలక బాధ్యతల నుంచి తప్పిస్తున్నారని, కొందరినైతే రహస్యంగా చంపేస్తున్నారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇక, జిన్‌పింగ్‌ వారసుడిగా వినిపిస్తున్న మరో పేరు వాంగ్‌ యాంగ్‌. చైనాలో మావో అనంత రం ఆ దేశాన్ని ఆర్థిక సంస్కరణల బాట పట్టించిన డెంగ్‌ జియావో పింగ్‌ ప్రోత్సాహంతో వాంగ్‌ యాంగ్‌ రాజకీయాల్లోకి వచ్చారు. సాంకేతిక నిపుణుడిగా, మార్కెట్‌ ఆధారిత సంస్కరణలకు మొగ్గు చూపేవాడిగా, వివాద రహితుడిగా ఆయనకు పేరుంది.


పెరుగుతున్న నిరుద్యోగం

చైనాలో నిరుద్యోగం భారీగా పెరుగుతోంది. స్థిరాస్తి రంగం స్తబ్ధుగా ఉంది. విదేశీ రుణం 50 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. జీవన ప్రమాణాలు పడిపోవటంతో ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోతోంది. పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఫ్యాక్టరీలను ధ్వంసం చేయటం, కొల్లగొట్టటం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే, జిన్‌పింగ్‌ను పక్కనపెట్టటం ద్వారా ప్రజాగ్రహాన్ని చల్లార్చాలని సీపీసీ ప్రయత్నిస్తోందా? కొత్త నాయకుడు చైనా పగ్గాలు చేపట్టనున్నారా?.. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


ఇవి కూడా చదవండి

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..


మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 05:51 AM