Aurangabad Incident: పెళ్లయిన 45 రోజులకే భర్తను చంపించింది
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:05 AM
మేఘాలయలో హనీమూన్ హత్య ఘటన తరహాలోనే బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో దారుణం జరిగింది.

ఇద్దరు కిరాయి హంతకులతో హత్య చేయించిన భార్య
పెళ్లికి ముందు నుంచే మేనమామతో ఆమెకు సంబంధం
అతనితో కలిసి హత్యకు కుట్ర
బిహార్‌లో ఘటన.. అరెస్టు
పట్నా, జూలై 3: మేఘాలయలో హనీమూన్ హత్య ఘటన తరహాలోనే బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లయిన 45 రోజులకే ఓ యువతి, తన ప్రియుడి సహకారంతో భర్తను కిరాయి హంతకులతో చంపించింది. నిందితురాలు 23ఏళ్ల గుంజాదేవి. ఆమెకు నబీన్‌నగర్ సమీపంలోని బర్వాన్ గ్రామానికి చెందిన ప్రియాంశు (25)తో పెళ్లయింది. ఈ వివాహం ఆమెకు ఇష్టంలేదు. పెళ్లికి నెలన్నర ముందు నుంచి గుంజాదేవికి తన మేనమామ జీవన్‌సింగ్ (55)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. గుంజాదేవి-జీవన్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీనికి ఇరువైపుల పెద్దలు అంగీకరించలేదు. ఆ తర్వాత ప్రియాంశుతో గుంజాదేవికి బలవంతంగా పెళ్లి జరిపించారు. ఆ తర్వాత కూడా.. జీవన్‌ను ఆమె మరిచిపోలేకపోయింది. భర్త ప్రియాంశును హత్య చేయించేందుకు జీవన్ సహకారంతో ఇద్దరు కిరాయి హంతకులను మాట్లాడుకుంది. జూన్ 25న తన సోదరిని కలిసేందుకు వెళ్లిన ప్రియాంశు నబీనగర్ రైల్వే స్టేషన్‌లో దిగాడు. తనను తీసుకెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు ఎవరినైనా పంపాలని గుంజాదేవికి ఫోన్ చేశాడు. దీన్నే అవకాశంగా తీసుకున్న ఆమె కిరాయి హంతకులను రైల్వే స్టేషన్‌కు పంపింది. వారు ప్రియాంశును బైక్‌పై ఎక్కించుకొని మార్గమధ్యలో తుపాకీతో కాల్చిచంపారు.
ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఎస్పీ ఏర్పాటు చేశారు. కుటుంబసభ్యులను పోలీసులు ప్రశ్నిస్తుండటంతో భయపడి అత్తగారి ఇంట్లోంచి పారిపోయేందుకు ప్రయత్నించిన గుంజాదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి ఫోన్‌లో కాల్‌లిస్ట్ ను పరిశీలించిన పోలీసులు.. భర్త హత్యకు గురైన రోజు జీవన్ నంబర్‌కు ఆమె పదేపదే ఫోన్ చేసినట్లు గుర్తించారు. గుంజాదేవి నుంచి హత్యకు సుపారీ తీసుకున్న ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న జీవన్‌ను పట్టుకునే పనిలో ఉన్నారు. కాగా ఔరంగాబాద్ జిల్లా నబీనగర్ సమీపంలో రెండు వారాల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లయిన కొన్నిరోజులకే పూజ అనే యువతి, తన ప్రియుడు కమలేశ్ యాదవ్‌తో కలిసి భర్త బిక్కూను హత్యచేసేందుకు యత్నించింది.