Marathi row: ఇన్వెస్టర్ సుశీల్ కేడియా కార్యాలయంపై దాడి.. ట్వీట్ చేసిన కాసేపటికే
ABN , Publish Date - Jul 05 , 2025 | 05:15 PM
మరాఠీ వివాదంపై రాజ్‌థాకరేను సవాల్ చేస్తూ కేడియా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు. ముంబైలో 30 ఏళ్లుగా ఉంటున్నా తనకు మరాఠీ సరిగా రాదని అన్నారు. మరాఠా ప్రజల కోసం అని చెబుతూ కొందరు అనుచిత కార్యక్రమాలకు దిగుతున్నారని, ఇందుకు ప్రతిగా తాను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నానని, మరాఠీని నేర్చుకునే ప్రసక్తే లేదని అన్నారు.

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఉండే వారంతా మరాఠీ నేర్చుకుని మాట్లాడాల్సిందేనని అంటున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరేను సవాల్ చేస్తూ పోస్ట్ పెట్టిన ఇన్వెస్టర్ సుశీల్ కేడియా (Sushil Kedia)పై ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం కొందరు వ్యక్తులు ముంబైలోని కేడియా కార్యాలయానికి చేరుకుని ఆఫీసుపై రాళ్లు రువ్వారు. మరాఠీ, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేకు మద్దతుగా నినాదాలు చేశారు.
కేడియా ఏమన్నారంటే..
మరాఠీ వివాదంపై రాజ్‌థాకరేను సవాల్ చేస్తూ కేడియా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు. ముంబైలో 30 ఏళ్లుగా ఉంటున్నా తనకు మరాఠీ సరిగా రాదని తెలిపారు. మరాఠా ప్రజల కోసం అని చెబుతూ కొందరు అనుచిత కార్యక్రమాలకు దిగుతున్నారని అన్నారు. ఇందుకు ప్రతిగా తానూ ప్రతిజ్ఞ చేస్తున్నానని, మరాఠీని నేర్చుకునే ప్రసక్తే లేదనీ, ఏం చేస్తారో చెప్పండని ఆ ట్వీట్‌లో ప్రశ్నించారు.
ట్వీట్ తొలగించి, క్షమాపణ..
కాగా, ముంబై కార్యాలయంపై దాడి అనంతరం కేడియా తిరిగి స్పందించారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరారు. మానసిక ఒత్తిళ్ల కారణంగానే తాను ట్వీట్ చేశానని తెలిపారు. మరాఠీ తెలియని వారిపై హింసాత్మక ఘటనల ప్రభావంతో ఒత్తిడికి గురై అతిగా స్పందించానని వివరణ ఇచ్చారు. రాజ్‌థాకరేపై ప్రశంసలు కురిపించారు. రాజ్ ఎన్నో కీలక అంశాలు లేవనెత్తారని, ప్రతి ఒక్కరి సమస్యలపైనా గట్టిగా నిలబడే సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పారు. థాకరేకు తాను వీరాభిమానిననీ, సొంత మనుషులే ఒకరిపై మరొకరు కలబడుతుంటే చూసి.. తాను అతిగా స్పందించానని తెలిపారు.
కేడియా గతంలోనూ థానేలోని భయందర్‌లో జరిగిన ఓ ఘటనపై స్పందించారు. ఆ ఘటనలో మరాఠీ మాట్లాడలేకపోవడంతో ఒక షాపు యజమానిపై ఎంఎన్‌ఎస్ స్కార్ఫ్‌లు ధరించిన కొందరు వ్యక్తులు దాడి చేశారు.
ఇవి కూడా చదవండి..
ప్రముఖ వ్యాపారి కాల్చివేత.. శాంతిభద్రతలపై సీఎం సమీక్ష
మోదీ ఎమోషనల్ స్పీచ్.. ఈ కుర్చీ ప్రత్యేకత ఇదే!
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి