Share News

Ek Ped Maa Ke Naam: రాష్ట్రంలో 'ఏక్ పెడ్ మా కే నామ్'@52 కోట్లు

ABN , Publish Date - Jul 09 , 2025 | 06:38 PM

ప్రధాని మోదీ పిలుపు మేరకు 'ఏక్ పెడ్ మా కే నామ్'(అమ్మ పేరిట ఒక మొక్క) క్యాంపెయిన్ దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 52 కోట్ల మొక్కలు నాటనుంది. 5 లక్షల ఎకరాలలో అటవీ విస్తీర్ణం పెరుగుదల ఒక అద్భుత విజయమని సీఎం..

Ek Ped Maa Ke Naam: రాష్ట్రంలో 'ఏక్ పెడ్ మా కే నామ్'@52 కోట్లు
Ek Ped Maa Ke Naam

అయోధ్య (ఉత్తరప్రదేశ్), జూలై 9: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది 52 కోట్ల మొక్కలు నాటనుంది. రాష్ట్రవ్యాప్త మెగా ప్లాంటేషన్ క్యాంపెయిన్ ప్రారంభించిన తర్వాత జరిగిన కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం 204 కోట్ల చెట్లను నాటిందని, వాటిలో 75% కంటే ఎక్కువ సజీవంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం తాము 52 కోట్ల మొక్కలను నాటబోతున్నామన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తాజాగా వెలువరించిన సర్వే నివేదిక వివరాలు పంచుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 5 లక్షల ఎకరాలలో అటవీ విస్తీర్ణం పెరుగుదల ఉందని సదరు నివేదికలు చెబుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. దీనిని.. భూమాత సంరక్షణకు యూపీ ప్రజలు చేస్తున్న కృషిగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అయోధ్యలోని దశరథ్ పథ్‌లోని రాంపూర్ హల్వారా గ్రామంలో మొక్కలు నాటారు. 'ఏక్ పెడ్ మా కే నామ్' (అమ్మ పేరిట ఒక మొక్క) క్యాంపెయిన్ లో భాగంగా సీఎం సెల్ఫీ తీసుకున్నారు.


కాగా, ఇవాళ ముఖ్యమంత్రి యోగి తన అయోధ్య పర్యటనను సంకట్ మోచన్ హనుమాన్‌గరి ఆలయ సందర్శనతో ప్రారంభించారు. రాష్ట్రానికి శాంతి, శ్రేయస్సు కోరుతూ. రామమందిర నిర్మాణ పురోగతిని సమీక్షించడానికి ఆయన ఆలయ సముదాయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. రామ్ దర్బార్‌లో ప్రార్థనలు చేశారు. ఆయన సాంప్రదాయ ఆచారాలు ఆచరించి ఉత్తరప్రదేశ్ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించారు. హనుమాన్‌గరి తరువాత, ముఖ్యమంత్రి రామ్ లల్లా గర్భగుడిలో ప్రార్థనలు చేశారు. హారతి ఇచ్చి, ఆలయ ప్రదక్షిణ చేశారు. ఆలయ నిర్మాణ పురోగతిని కూడా సీఎం యోగి పరిశీలించారు.

ఆలయ నిర్మాణ ప్రస్తుత స్థితి, రాబోయే దశల గురించి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆఫీస్ బేరర్లు సీఎం కు వివరించారు. ఈ ఉదయం అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం యోగికి స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కాగా, జూలై నెలలో ముఖ్యమంత్రి అయోధ్యకు వెళ్లడం ఇదే తొలిసారి. ఆయన చివరిగా జూన్ 5న రామ దర్బార్ ప్రారంభోత్సవానికి అయోధ్య వచ్చారు.


ఇవి కూడా చదవండి

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 09 , 2025 | 07:17 PM