Aadhar Update: గుడ్ న్యూస్.. ఆధార్ ఆప్‌డేట్ గడువు పొడిగింపు
ABN , Publish Date - Jun 14 , 2025 | 05:09 PM
ఆధార్ డేటాబేస్‌లో ప్రస్తుతం.. కచ్చితమైన సమాచారాన్ని ఉంచేందుకు ఆధార్ హోల్డర్లకు ఉడాయ్ అవకాశం కల్పిస్తోంది. ఆధార్ లో చిరునామా వంటి వివరాలు ఉచితంగా మార్చుకునేందుకు ఉడాయ్ మరో ఏడాది పాటు సమయాన్ని పొడిగించింది.

న్యూఢిల్లీ, జూన్ 14: ఆధార్ అప్‌డేట్ చేసుకునే వారికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌లోడ్ చేసుకునేందుకు ఇచ్చిన గడువు జూన్ 14వ తేదీతో.. అంటే నేటితో ముగియనుంది. అలాంటి వేళ ఉడాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా శనివారం వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని స్పష్టం చేసింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా ఈ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆధార్ డేటాబేస్‌లో ప్రస్తుతం.. కచ్చితమైన సమాచారాన్ని ఉంచేందుకు ఆధార్ హోల్డర్లకు ఉడాయ్ ఈ అవకాశం కల్పిస్తోంది. గుర్తింపు పొందిన ఆధారాలు, చిరునామాకు సంబంధించిన పత్రాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు అనుమతిస్తోంది. అంటే.. వివాహం కావడం.. ఉన్నత చదువులు, తదితర కారణాల వల్ల కొందరు వేర్వేరు ప్రదేశాలకు మారుతూంటారు. అలాంటి వారికి ఇది ఉపయుక్తంగా ఉండనుంది. మరోవైపు ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయ్యి ఉంటుందో వారు కూడా తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని గతంలో ఉడయ్ సూచించిన సంగతి తెలిసిందే.
ఆన్‌లైన్‌లో ఎలాగంటే..
ఆన్‌లైన్‌లో ఆధార్ ఉచిత అప్ డేట్ చేయాలంటే.. ముందుగా యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఆధార్ నంబర్‌తో లాగిన్ కావాలి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీతో లాగిన్ అయిన వెంటనే అప్పటికే ఉన్న మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
అయితే అందులోని వివరాలన్నీ సరైనవో కాదో చెక్ చేసుకోండి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేయాల్సి ఉంటుంది. లేదా ఉన్న వివరాలను పరిశీలించి.. నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి.
తర్వాత కనిపించే డ్రాప్ డౌన్ లిస్ట్ సాయంతో డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను అప్‌లోడ్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.
14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దీని ద్వారా అప్‌డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.