TVK Vijay: ఒంటరిగానే బరిలోకి.. సీఎం అభ్యర్థిగా విజయ్ పోటీ
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:06 AM
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, డీఎంకే పార్టీలతో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) నిర్ణయింది.

- ప్రతి ఇంటిలో ఒకరికి పార్టీ సభ్యత్వం
- టీవీకే కార్యనిర్వాహక మండలిలో నిర్ణయం
- ఆగస్టులో రెండో మహానాడుకు ఏర్పాట్లు
చెన్నై: వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, డీఎంకే పార్టీలతో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) నిర్ణయింది. నగర శివారు ప్రాంతం పనైయూరులో పార్టీ అధినేత విజయ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశం ఈ మేరకు తీర్మానించింది. ఆగస్టులో రెండో మహానాడు జరిపిన తర్వాత సెప్టెంబర్ నుంచి విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించాలని కూడా నిర్ణయించారు. ఈ సమావేశంలో కార్యనిర్వాహక మండలి సభ్యులు, జిల్లా శాఖల కార్యదర్శులు,
ప్రత్యేక ఆహ్వానితులు సహా 1200 మంది పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే ఎన్నికల పొత్తులపై తుది నిర్ణయం తీసుకునే అధికారం పార్టీ అధ్యక్షుడు విజయ్‌కే అప్పగిస్తూ ఓ తీర్మానం కూడా చేశారు. ప్రతిఇంటా ఒకరికి పార్టీ సభ్యత్వం కల్పించాలని, వీధిలో కనీసం ఇద్దరు పార్టీ సభ్యులు తప్పనిసరిగా ఉండాలని, ఆ దిశగా పార్టీ సభ్యత్వ ముమ్మర కార్యక్రమాలను వేగవంతం చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో 20 తీర్మానాలను ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఆమోదించారు.
జమిలి ఎన్నికలకు నిరసన...
టీవీకే కార్యనిర్వాహక మండలిలో కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం పునర్విభజన పేరుతో లోక్‌సభ నియోజకవర్గాలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ, ఒకే దేశం ఒకే ఎన్నికల నినాదంతో జరుపతలపెడుతున్న జమిలి ఎన్నికలకు నిరసన వ్యక్తం చేస్తూ వేర్వేరు తీర్మానాలు చేశారు. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా విజయ్ పోటీ చేయాలని, పొత్తులపై ఆయనే తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానాలు చేశారు.
రెండో విమానాశ్రయం ఏర్పాటుతో భూములను కోల్పోనున్న పరందరూ సహా 13 గ్రామాల ప్రజల ఆందోళనకు అండగా నిలవాలని, పార్టీ సిద్ధాంతాలను విబేధించే పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదని, రైతుల ఆందోళన పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ, వరి, చెరకు రైతులకు పెండింగ్‌లో ఉంచిన బకాయిలను వెంటనే చెల్లించాలని, తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతూ మరి కొన్ని తీర్మానాలు చేశారు.
తిరుచ్చిలో ఇసుక చోరీలను అరికట్టాలని, ఎన్నెల్సీకి స్థలమిచ్చిన దాతలకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించి, కుటుంబలో ఒకరి ఉద్యోగం ఇవ్వాలని, దిండుగల్ జిల్లాలో సుగంథ ద్రవ్యాల కర్మాగారాన్ని నెలకొల్పాలని, జాక్టో-జియో ఆందోళనకు మద్దతు ప్రకటిస్తూ, తమిళ జాలర్ల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని కూడా తీర్మానాలను ప్రతిపాదించి ఆమోదించారు. రాష్ట్రంలో ద్విభాషా విద్యావిధానమే కొనసాగాలని కోరుతూ,
పెరియార్, అన్నాదురై కీర్తి ప్రతిష్ఠలకు కళంకపరిచేలా వ్యవహరించిన బీజేపీ నేతల వైఖరిని ఖండిస్తూ, లాకప్ మరణాలను నిరోధించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ కూడా తీర్మానాలు చేశారు. కీళడి పురావస్తు తవ్వకాల నివేదికలను ఆమోదించకుండా తమిళుల నాగరికత కాలం వెలుగులోకి రానివ్వకుండా అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ మరొక తీర్మానం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విశాఖ వందేభారత్‌కు ఇకపై 20 బోగీలు
నిరుద్యోగుల కష్టాలు కనబడట్లేదా...
Read Latest Telangana News and National News