Tungabhadra River: తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల ఎత్తివేత..
ABN , Publish Date - Jul 03 , 2025 | 01:00 PM
తుంగభద్ర జలాశయం నుంచి అధికారులు బుధవారం నీటిని విడుదల చేశారు. డ్యాం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 78.100 టీఎంసీలకు చేరాయి.

- ముందస్తు వర్షాలతో జూలైలోనే..
బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర జలాశయం(Tungabhadra Project) నుంచి అధికారులు బుధవారం నీటిని విడుదల చేశారు. డ్యాం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 78.100 టీఎంసీలకు చేరాయి. డ్యాం భద్రత దృష్ట్యా ఈ ఏడాది 80 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయవద్దని నిపుణులు సూచించడంతో అధికారులు ఆరు క్రస్ట్‌గేట్‌లను తెరిచారు. నదిలోకి 17,635 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ఠ నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1625.20 అడుగుల వరకూ నీరు చేరింది.
నీటి పారుదల సలహా మండలి తీర్మానం మేరకు కాలువలకు నీటి విడుదల ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. వివిధ సాగునీటి కాలువలకు 1,701 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాంలోకి 32,494 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. జలాశయం నీటి నిల్వలు గురువారం ఉదయానికి 80 టీఎంసీలు దాటే అవకాశం ఉండటంతో అధికారులు బుధవారం ఉదయం రెండు క్రస్ట్‌గేట్లను ఎత్తి.. తొలుత 4,680 క్యూసెక్కుల నీటిని నదికి వదిలారు. అనంతరం ఇన్‌ఫ్లో పెరుగుతుండడంతో సాయంత్రానికి నాలుగు గేట్లను రెండడుగుల మేరకు ఎత్తి 9,400 క్యూసెక్కుల నీరు నదికి వదిలారు. ఆ తరువాత మరో రెండు గేట్లను ఎత్తారు. మొత్తంగా ఆరు క్రస్ట్ గేట్‌ల నుంచి 17,635 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
భద్రతకు ప్రాధాన్యం
తుంగభద్ర జలాశయం ఎగువ పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇన్‌ఫ్లో పెరుగుతూ వచ్చింది. గత ఏడాది 19వ క్రస్ట్‌గేట్ కొట్టుకుపోయాక మిగిలిన క్రస్ట్‌గేట్‌ల పరిస్థితిని కేంద్ర జల సంఘం నిపుణులు పరిశీలించారు. డ్యాం భద్రత దృష్ట్యా ఈ ఏడాది నీటి నిల్వలను 80 టీఎంసీలకు పరిమితం చేయాలని సూచించారు. తాజా నిల్వలు, వరదల నేపథ్యంలో డ్యాం అధికారులు ముందు జాగ్రత్తగా నీటిని నదికి వదులుతున్నారు.
జలాశయం భద్రతపై గట్టి నిఘా పెట్టారు. సాధారణంగా జలాశయం నుంచి ఆగస్టులో నదికి నీటిని వదిలేవారు. కానీ ఈ ఏడాది క్రస్ట్‌గేట్‌లపై ఒత్తిడి ఉండకూడదని నెలరోజుల ముందే నీటిని వదులుతున్నారు. జలాశయం చరిత్రలో ఇంత ముందస్తుగా నదికి నీరు వదిలిన సందర్భాలు లేవని బోర్డు అధికారులు అంటున్నారు. ఎల్‌బీఎంసీ, ఎల్లెల్సీ, హెచ్చెల్సీ లాంటి ప్రధాన కాలువలకు ఇప్పటి వరకు నీటిని విడుదల చేయలేదు.
ఆ కాలువల మరమ్మతుల నేపథ్యంలో తాత్కాలికంగా ఆలస్యం చేస్తున్నారు. ఈ నెల 10 తేదీ నాటికి కాలువలకు చిన్నపాటి మరమ్మతులన్నీ పూర్తి అవుతాయి. దీంతో అప్పటివరకు జలాలను నదికి వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. 10వ తేదీ నుంచి హెచ్చెల్సీతో పాటు ఎల్లెల్సీకి కర్ణాటక వాటా నీటిని వదలాలని నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం!
రేవంత్.. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్!
Read Latest Telangana News and National News