Kashmir Terrorism: పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్
ABN , Publish Date - Jul 29 , 2025 | 03:58 AM
పహల్గాం ఉగ్రదాడితో 26 మందిని పొట్టనబెట్టుకున్న ముష్కరులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.

సులేమాన్ సహా ముగ్గురి హతం
ఉగ్రవాదుల వద్ద చైనా శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలు
14 రోజులుగా ట్రాక్ చేసిన బలగాలు
దాచిగామ్ అడవుల్లో వేట.. మెరుపు దాడితో ఆట కట్టించిన భద్రతా దళాలు
శ్రీనగర్, జూలై 28: పహల్గాం ఉగ్రదాడితో 26 మందిని పొట్టనబెట్టుకున్న ముష్కరులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ‘ఆపరేషన్ మహాదేవ్’ పేరుతో సోమవారం ఉదయం చేపట్టిన దాడుల్లో.. పహల్గాం మాస్టర్‌మైండ్ సులేమాన్ షా అలియాస్ హాషిం మూసా అలియాస్ అబూ సులేమాన్, మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతిచెందిన మిగతా ఇద్దరు ఉగ్రవాదులను యాసిర్ అలియాస్ హరీస్, అబూ హమ్జాగా అనుమానిస్తున్నారు. నెల రోజుల కిందట భద్రతాబలగాలు సులేమాన్, ఇతర ఉగ్రవాదుల కోసం వేటను ప్రారంభించాయి. ఈ క్రమంలో దాచిగామ్ అడవులను జల్లెడ పట్టాయి. దట్టమైన అడవుల్లో.. హర్వాన్ ప్రాంతంలో శాటిలైట్ సిగ్నల్స్ వెళ్తున్నట్లు గుర్తించిన బలగాలు.. 14 రోజులుగా ఆ ప్రాంతంపై నిఘా పెట్టి, ఉగ్రవాదులను ట్రాక్ చేశాయి. రెండ్రోజుల క్రితం ఉగ్రవాదుల షెల్టర్ వద్ద దాడికి వ్యూహాన్ని రచించాయి. ఈ క్రమంలో స్థానిక సంచార జాతుల సహాయం తీసుకున్నాయి. ఉగ్రవాదులు పైన టెంట్ వేసుకుని, భూమిలో తవ్విన గొయ్యిలో నక్కినట్లు గుర్తించాయి. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన 24 బృందాలు, నాలుగు పారా రెజిమెంట్ బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలతో సంయుక్తంగా ‘ఆపరేషన్ మహాదేవ్’ను చేపట్టాయి. ఉగ్రవాదుల షెల్టర్‌పై కాల్పులు జరిపాయి. ఈ దాడిలో సులేమాన్ సహా.. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. డ్రోన్ కెమెరాల ద్వారా.. ఉగ్రవాదులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 తుపాకులు, ఒక ఎం4 కార్బైన్, 17 గ్రనేడ్లు, తూటాలు, చైనాకు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలు, ఇతర సామగ్రిని భద్రతాబలగాలు సీజ్ చేశాయి. ఉగ్రవాదులు కోలుకునేలోపే.. భద్రతాబలగాలు ఆపరేషన్‌ను పూర్తిచేసినట్లు తెలుస్తోంది. కాగా.. పహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పర్వీజ్ అహ్మద్ జోథార్, బషీర్ అహ్మద్‌లను పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే..! అయితే.. ‘ఆపరేషన్ మహాదేవ్’ గురించి భద్రతాబలగాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మృతదేహాల పోస్టుమార్టం పూర్తయ్యాక.. వారిని సులేమాన్, అబూహమ్జా, యాసిర్‌గా తేలితే.. అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న భద్రతా దళాలను నార్తర్న్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు.
ఎవరీ సులేమాన్?
పాక్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్‌లో పనిచేసిన సులేమాన్.. ఆ తర్వాత లష్కరే తాయిబా శిక్షణ పొందాడు. 2023లో భారత్‌లోకి చొరబడ్డాడు. బారాముల్లా సహా.. పలు ఉగ్రదాడులకు ఇతడు నాయకత్వం వహించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రదాడి జరిపి.. 26 మందిని పొట్టనబెట్టుకున్నాడు. ఈ దాడికి ఎల్‌ఈటీ అనుబంధ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది. అప్పట్లోనే ఉగ్రవాదులను భద్రతాబలగాలు ట్రాక్ చేసినా.. వారు అడవుల్లో తప్పించుకున్నారు.
మహాదేవ్ పేరెందుకు?
దాచిగామ్ సమీపంలో మహాదేవ్ పర్వతం ఉంది. అందుకే.. ఈ ఆపరేషన్‌కు మహాదేవ్‌గా పేరు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
For More National News and Telugu News..