Minister Rammohan Naidu: అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దు
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:09 AM
ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రస్తుతం వచ్చింది ప్రాథమిక నివేదిక మాత్రమేనని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.

ఇది ప్రాథమిక నివేదికే: రామ్మోహన్ నాయుడు
న్యూఢిల్లీ, జూలై 12: ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రస్తుతం వచ్చింది ప్రాథమిక నివేదిక మాత్రమేనని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తుది నివేదిక వెలువడే వరకు ఒక నిర్ణయానికి రావొద్దని కోరారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తును సవాలుతో కూడుకున్నదన్నారు. ఇందులో ఎన్నో సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయని, అందువల్ల ఈ నివేదికపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుందన్నారు. ‘‘ఈ నివేదికను పౌర విమానయాన శాఖ క్షుణ్నంగా విశ్లేషిస్తోంది. ఇప్పుడే ఎలాంటి నిర్ణయాలకు రాకూడదు. తుది నివేదిక వెలువడిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి రాగలం’ అని మంత్రి తెలిపారు. కాగా, చాలా తక్కువ సమయం మాత్రమే జరిగిన పైలట్ల సంభాషణ ఆధారంగా విమాన ప్రమాదంపై ఒక నిర్ణయానికి రాలేమని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ అభిప్రాయపడ్డారు.