Share News

Punjab Terror Plot: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. నలుగురు లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుల అరెస్టు

ABN , Publish Date - Nov 26 , 2025 | 09:47 PM

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్స్ గురించిన సమాచారం అందడంతో డేరా బస్సి-అంబాలా హైవే వెంబడి ఉన్న ఒక ఇంటిని తాము చుట్టుముట్టామని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లు కాల్పులు జరిపారని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) తెలిపారు.

Punjab Terror Plot: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. నలుగురు లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుల అరెస్టు
Terror plot foiled in punjab

న్యూఢిల్లీ: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర (Terror Plot)ను పోలీసులు భగ్నం చేశారు. ఎదురెదురు కాల్పుల అనంతరం లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన నలుగురిని బుధవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. విదేశీ హ్యాండ్లర్ 'గోల్డీ ధిల్లాన్' ఆదేశాలపై వీరు ఉగ్రచర్యలకు పాల్పడుతున్నారని, ట్రైసిటీ (చండీగఢ్, మొహాలి, పంచకుల), పాటియాలా ప్రాంతంలో దాడులకు ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు.


పంజాబ్ యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ (ఏడీటీఎఫ్), ఎస్ఏఎల్ నగర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. పట్టుబడిన నలుగురిలో హర్వీందర్ సింగ్ అలియాస్ భోలా అలియాస్ హనీ, లఖ్వీందర్ సింగ్‌‌లు రాజ్‌పురలోని ధాకన్సు కలన్‌ నివాసులుగా గుర్తించామని, తక్కిన ఇద్దరిని రాజ్‌పుర, పాటియాలాకు చెందిన మహమ్మద్ సమీర్, రోహిత్ శర్మలుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి పాయింట్ 32 క్యాలిబర్ పిస్తోళ్లు ఏడు, 70 లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.


లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్స్ గురించిన సమాచారం అందడంతో డేరా బస్సి-అంబాలా హైవే వెంబడి ఉన్న ఒక ఇంటిని తాము చుట్టుముట్టామని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లు కాల్పులు జరిపినట్టు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) తెలిపారు. ఈ కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ గగన్‌దీప్ సింగ్, కానిస్టేబుల్ గులాబ్ సింగ్‌ల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లకు బుల్లెట్లు వచ్చి తగలాయని అన్నారు. దీంతో తాము ఎదురుకాల్పులు జరిపామనీ, హర్వీందర్ సింగ్ అలియాస్ భోలా, మహమ్మద్ సమీర్‌లకు బుల్లెట్ గాయాలు కాగా, వారితో పాటు మరో ఇద్దరిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కాగా, ఘటనా స్థలికి చేరుకున్న ఎస్ఏఎస్ నగర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్మన్‌దీప్ హన్స్ మాట్లాడుతూ, అరెస్టయిన నలుగురికి నేర చరిత్ర ఉందని, టెర్రర్ మాడ్యూల్‌‌కు చెందిన ఇతర ఆపరేటివ్స్‌ను గుర్తించేందుకు తదుపరి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్

రామభక్తుల సంకల్పం సిద్ధించింది: ప్రధాని మోదీ

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 26 , 2025 | 09:48 PM