Mallikarjun Kharge: బాధ్యత తీసుకోండి లేదా రిటైర్ కండి: నేతలకు ఖర్గే వార్నింగ్
ABN , Publish Date - Apr 09 , 2025 | 07:43 PM
బీజేపీపై ఖర్గే విమర్శలు గుప్పిస్తూ, భవిష్యత్ సవాళ్లను పరిష్కరించే బదులు శతాబ్దాల క్రితం నాటి అంశాలను పైకి తెస్తూ మతపరమైన విభజనలను పెంచుతోందని అన్నారు. అలాంటి ప్రమాదకరమైన ఆలోచనలను పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు.

అహ్మదాబాద్: పార్టీ కోసం పనిచేసేందుకు ఇష్టం లేని వారు విశ్రాంతి తీసుకోవచ్చని, బాధ్యతలు సక్రమంగా నిర్వహించేందుకు సిద్ధంగా లేని వారు రిటైర్ కావచ్చని కార్యకర్తలు, నేతలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) స్పష్టమైన సందేశం ఇచ్చారు. గుజరాత్‌ని అహ్మదాబాద్‌లో బుధవారంనాడు జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో ఖర్గే అధ్యకోపన్యాసం చేస్తూ, పార్టీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల పాత్ర కీలకమని, వారి నియామకాలు ఏఐసీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా కఠినంగా, సజావుగా ఏడాదిలోపు జరుగుతాయని అన్నారు. ఇందులో ఎలాంటి పక్షపాతానికి తావుండదని చెప్పారు. రాహుల్ గాంధీ ఇప్పటికే దేశవ్యాప్తంగా జిల్లా అధ్యక్షులతో మూడుసార్లు సమావేశమయ్యారని తెలిపారు. మునుముందు ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో జిల్లా అధ్యక్షుల ప్రమేయం కూడా ఉంటుందన్నారు.
Rahul Gandhi: కులగణనపై పార్లమెంటులో బిల్లు తెస్తే ఆమోదిస్తాం
గాంధీ, పటేల్ సిద్ధాంతాలతో..
కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతిక మూలాలపై ఖర్గే స్పష్టతనిస్తూ, మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ సిద్ధాంతాలకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని, వారి సిద్ధాంతాలతోనే ముందుకు వెళ్తుందని చెప్పారు. న్యాయమార్గంలో దృఢ సంకల్పం, పోరాటం, అంకితభావంతో పార్టీ ముందుకు వెళ్తుందని, ఈ సందేశాన్ని కార్యకర్తలంతా ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఇవాల్టి రాజకీయ పోరాటాన్ని మోడ్రన్ డే ఫ్రీడమ్ స్ట్రగుల్గా ఆయన పేర్కొన్నారు. "మనం తిరిగి భారతదేశ స్వాతంత్ర్యం కోసం పారాడుతున్నాం. అన్యాయం, అసమానత్వం, వివక్ష, పేదరికం, మతతత్వమే మన శత్రువులు. ఒకప్పుడు విదేశీయుల అన్యాయంపై పోరాడాం, ఇప్పుడు మన ప్రభుత్వాలే ఆ పని చేస్తున్నారు. కానీ, ఈ పోరాటంలో కూడా మనం గెలవాలి" అని పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
మతపరమైన విభజనలు
బీజేపీపై ఖర్గే విమర్శలు గుప్పిస్తూ, భవిష్యత్ సవాళ్లను పరిష్కరించే బదులు శతాబ్దాల క్రితం నాటి అంశాలను పైకి తెస్తూ మతపరమైన విభజనలను పెంచుతోందని అన్నారు. అలాంటి ప్రమాదకరమైన ఆలోచనలను పార్టీ కార్యకర్తలు ఎన్నటికీ బలపరచరాదని సూచించారు. పార్టీ కోసం పనిచేయని వారు విశ్రాంతి తీసుకోవచ్చని, బాధ్యతలను నెరవేర్చేందుకు సిద్ధంగా లేని వారు రిటైర్ కావచ్చని తాను స్పష్టంగా చెప్పదలచుకున్నానని అన్నారు.