Share News

Tahawwur Rana: పాక్‌ ఆర్మీకి విశ్వాసపాత్రుడైన ఏజెంట్‌ని

ABN , Publish Date - Jul 08 , 2025 | 05:28 AM

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలో ఉన్న ముంబై పేలుళ్ల కేసు నిందితుడు తహవ్వుర్‌ రాణా.. విచారణలో పలు సంచలన విషయాలు బయటపెట్టాడు.

Tahawwur Rana: పాక్‌ ఆర్మీకి విశ్వాసపాత్రుడైన ఏజెంట్‌ని

2008లో ముంబైపై దాడుల్లో కీలకపాత్ర పోషించా

  • దాడులకు ముందు ముంబైలో తిరిగా

  • దాడుల సమయంలో ఆ నగరంలోనే ఉన్నా

  • హెడ్లీ నా చిన్ననాటి స్నేహితుడు.. మేమిద్దరం కలిసి లష్కరే ఉగ్ర శిబిరాల్లో శిక్షణ పొందాం

  • ఎన్‌ఐఏ విచారణలో తహవ్వుర్‌ రాణా వెల్లడి!

న్యూఢిల్లీ, జూలై 7: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలో ఉన్న ముంబై పేలుళ్ల కేసు నిందితుడు తహవ్వుర్‌ రాణా.. విచారణలో పలు సంచలన విషయాలు బయటపెట్టాడు. 2008లో ముంబైపై దాడులు (26/11) జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని.. ఆ దాడుల వెనుక తన ప్రమేయం ఉందని అతడు అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలోని తిహాడ్‌ జైల్లో ఉన్న తహవ్వుర్‌ను.. ఎన్‌ఐఏతోపాటు ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కూడా విచారిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఈ విచారణలో అతడు తన తప్పులన్నీ ఒప్పుకొన్నాడు. తాను 1986లో రావల్పిండిలోని పాకిస్థాన్‌ ఆర్మీ వైద్య కళాశాలలో వైద్య విద్య (ఎంబీబీఎస్‌) పూర్తిచేశానని.. అనంతరం పాక్‌ ఆర్మీ తనను క్వెట్టాలో కెప్టెన్‌ (డాక్టర్‌)గా నియమించిందని చెప్పాడు. తనకు సింధ్‌, బెలూచిస్థాన్‌, బహావల్‌పూర్‌, సియాచెన్‌-బలోత్రా వంటి సున్నితమైన ప్రాంతాల బాధ్యతలు అప్పగించారని, కానీ ఊపిరితిత్తుల్లో సమస్యల కారణంగా తాను విధులకు హాజరు కాకపోవడంతో ఆర్మీ తనను ‘డెజర్టర్‌’గా ప్రకటించిందని చెప్పాడు (చెప్పాపెట్టకుండా, మళ్లీ తిరిగొచ్చే ఉద్దేశం లేకుండా ఆర్మీని విడిచిపెట్టి పారిపోయేవారిని ఆర్మీ ‘డెజర్టర్‌’గా ప్రకటిస్తుంది).


అలా తన మీద పడ్డ ‘డెజర్టర్‌’ అనే ముద్రను రికార్డుల నుంచి తొలగించుకోవడానికి.. డేవిడ్‌ హెడ్లీకి సాయం చేసేందుకు అంగీకరించినట్టు చెప్పాడు. 26/11 దాడులకు ముందు.. ‘ఇమ్మిగ్రెంట్‌ లా సెంటర్‌’ ప్రతినిధిగా డేవిడ్‌ హెడ్లీ ముంబై, ఢిల్లీ, పుణె సహా పలు నగరాల్లో పర్యటించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఆ కంపెనీని ఏర్పాటు చేయడం వెనుక తానే కీలకపాత్ర పోషించానని రానా విచారణలో తెలిపాడు. ముంబైలో కీలక లక్ష్యాలను గుర్తించడంలో కూడా హెడ్లీకి తాను సాయం చేశానని ఒప్పుకొన్నాడు. దాడులకు ముందు తాను కూడా ముంబైకి చేరుకుని.. ఒక హోటల్‌లో బస చేశానని.. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ సహా ఆ నగరంలో పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించానని తెలిపాడు. డేవిడ్‌ హెడ్లీ భారత్‌కు రావడానికి అవసరమైన నకిలీ గుర్తింపు పత్రాలను సృష్టించానని వెల్లడించాడు. పాక్‌ గూఢచార సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎ్‌సఐ) సహకారంతోనే దాడులు జరిపినట్టు స్పష్టం చేశాడు. 26/11 దాడుల్లో.. పాకిస్థాన్‌ ఆర్మీకి విశ్వాసపాత్రుడైన ఏజెంట్‌గా తాను పోషించిన పాత్ర గురించి వివరించాడు. పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో తాను, తన చిన్ననాటి స్నేహితుడు డేవిడ్‌ కోల్‌మన్‌ హెడ్లీ శిక్షణ పొందినట్లు తెలిపాడు. గల్ఫ్‌ యుద్ధం సమయంలో పాక్‌ ఆర్మీ తనను సౌదీఅరేబియాకు కూడా ఒక రహస్య మిషన్‌పై పంపిందని వెల్లడించాడు.

Updated Date - Jul 08 , 2025 | 05:28 AM