Share News

Supreme Court: అన్ని హద్దులూ దాటేస్తున్నారు!

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:18 AM

రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ని దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు

Supreme Court: అన్ని హద్దులూ దాటేస్తున్నారు!
Supreme Court

రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీ దుర్వినియోగం: సుప్రీంకోర్టు

  • ముడా కేసులో కర్ణాటక సీఎం భార్యకు ఊరట

  • క్లైంట్లకు సలహాపై లాయర్లకు ఈడీ సమన్లు.. సుప్రీం తీవ్ర ఆగ్రహం

  • ఈడీ సూపర్‌ పోలీసు కాదంటూమద్రాసు హైకోర్టు మొట్టికాయ

న్యూఢిల్లీ, జూలై 21: రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌)ని దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈడీ అధికారులు అన్ని హద్దులూ దాటేస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజకీయాల్లో పావుగా మారొద్దని ఈడీకి హితవు పలికింది. ‘రాజకీయ యుద్ధాలను ఎన్నికల వరకే పరిమితం కానివ్వండి. ఇందులో మిమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నారు?’ అని ఈడీని ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. రాజకీయాలకు కోర్టును వేదికగా మార్చొద్దని హెచ్చరించింది. ఈడీ గురించి తాము ఇంతకంటే కఠినంగా మాట్లాడేలా చేయొద్దని ఏఎస్‌జీని కోరింది. సోమవారం రెండు కేసుల విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. వీటిలో ఒకటి కర్ణాటక సీఎం సిద్దరామయ్య భార్యకు ముడా కేసులో ఉపశమనం కల్పిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈడీ అప్పీలుకు సంబంధించినది కాగా, రెండోది క్లైంట్‌లకు సలహాలు ఇచ్చినందుకు సీనియర్‌ న్యాయవాదులకు ఈడీ సమన్లు జారీ చేసిన కేసు. ముడా(మైసూర్‌ పట్టణాభివృద్ధి సంస్థ) స్థలాల అక్రమ కేటాయింపుల కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్య భార్య బీఎం పార్వతి, కర్ణాటక పట్టణాభివృద్ధి మంత్రి బైరాతి సురేశ్‌లపై మనీ లాండరింగ్‌ ప్రొసీడింగ్స్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేయడంతో ఈడీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. తాజాగా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసులో దిగువ కోర్టుతోపాటు హైకోర్టు కూడా చాలా స్పష్టంగా తీర్పులు ఇచ్చినప్పటికీ ఈడీ అప్పీలు చేయడాన్ని సీజేఐ ప్రశ్నించారు. ‘విచారణ కోర్టు తీర్పును సింగిల్‌ జడ్జి సమర్థించారని మీకు బాగా తెలుసు. రాజకీయ యుద్ధాలు ఎన్నికల వరకే పరిమితం కానివ్వండి. ఇందులో మిమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నారు? దురదృష్టవశాత్తూ మహారాష్ట్రలోనూ ఈడీ నుంచి ఇలాంటి వైఖరినే చూశాం. ఇంతకుమించి వ్యాఖ్యానించేలా మాపై ఒత్తిడి తీసుకురావొద్దు. లేదంటే ఈడీ గురించి ఇంతకంటే కఠినంగా మేం మాట్లాడాల్సి వస్తుంది’ అని సీజేఐ పేర్కొన్నారు. దీంతో అప్పీలును ఉపసంహరించుకుంటున్నామని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) ఎస్‌వీ రాజు తెలపగా, కఠిన పదాలు వాడకుండా మమ్మల్ని కాపాడారంటూ ఆయనకు సీజేఐ ధన్యవాదాలు తెలిపారు.


ఈడీకి అడ్డుకట్ట వేసేందుకు మార్గదర్శకాలు అవసరం

తమ క్లైంట్‌లకు న్యాయ సలహాలు ఇచ్చారంటూ సీనియర్‌ న్యాయవాదులు డి.అరవింద్‌, ప్రతాప్‌ వేణుగోపాల్‌లకు ఈడీ సమన్లు జారీ చేయడంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. న్యాయ వృత్తిపై ఈడీ చర్యలు భయంకరంగా ఉన్నాయన్న సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌.. కొన్ని అంతర్జాతీయ ఘటనలనూ విచారణలో ప్రస్తావించారు. ‘టర్కీలో మొత్తంగా బార్‌ అసోసియేషన్‌నే రద్దు చేయడం చూశాం. చైనాలోనూ అలాంటిదే చూశాం. మనం ఆ దిశలో వెళ్లకూడదు. కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలి’ అన్నారు. దీనికి సీజేఐ అంగీకరించారు. ఈ అంశంలో అమికస్‌ క్యూరీని నియమిస్తామని తెలిపారు. దీంతో సీనియర్‌ న్యాయవాదులకు జారీ చేసిన సమన్లను ఈడీ ఉపసంహరించుకుంది. ఇకపై ఈడీ డైరెక్టర్‌ అనుమతి లేకుండా లాయర్లకు సమన్లు జారీ చేయబోంటూ ఈడీ ఒక లేఖను విడుదల చేసింది. కాగా, ఈడీపై తప్పుడు అభిప్రాయం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 04:20 AM