Supreme Court: మాజీ సీజేఐ చంద్రచూడ్‌ను ఖాళీ చేయించండి
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:10 AM
సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ చంద్రచూడ్‌ను వెంటనే ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు పాలనా విభాగం కోరింది.

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ
2024 నవంబరు 10న ఆయన పదవీ విరమణ.. 8 నెలలుగా అక్కడే నివాసం
త్వరలోనే ఖాళీ చేస్తాను: చంద్రచూడ్
న్యూఢిల్లీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ చంద్రచూడ్‌ను వెంటనే ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు పాలనా విభాగం కోరింది. 2024 నవంబరు 10న సీజేఐగా పదవీ విరమణ పొందిన జస్టిస్ చంద్రచూడ్.. గత 8 నెలలుగా టైప్-8 అధికారిక బంగ్లాలోనే ఉంటున్నారని తెలుపుతూ కేంద్ర హౌజింగ్, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. రిటైర్ అయ్యాక టైప్-7 ప్రభుత్వ బంగ్లాలో ఆరు నెలల పాటు అద్దె చెల్లించకుండానే ఉండొచ్చని, ఆ గ్రేస్ పీరియడ్ కూడా ఇప్పటికే గడిచిపోయిందని ఆ లేఖలో గుర్తు చేసింది.
ప్రస్తుతం సీజేఐగా ఉన్న వారికి టైప్-8 అధికారిక బంగ్లాను కేటాయించాల్సి ఉన్నందున, దాన్ని వెంటనే ఖాళీ చేయించాలని కోరింది. అధికారిక బంగ్లాలో నివసించేందుకు మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌కు ఇచ్చిన గడువు మే 31తోనే ముగిసిందని గుర్తు చేసింది. కాగా.. జస్టిస్ చంద్రచూడ్ తర్వాత జస్టిస్ ఖన్నా సీజేఐగా నియమితులయ్యారు. అయితే, ఆయన 6 నెలలు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. అలా ఉన్నప్పుడు.. 2024 డిసెంబరు 18న జస్టిస్ ఖన్నాకు జస్టిస్ చంద్రచూడ్‌ఒక లేఖ రాశారు.
ఇప్పటికే తనకు తుగ్లక్ రోడ్డులోని బంగ్లా నంబర్ 14ను కేటాయించారని, అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయని.. పనులు పూర్తయిన వెంటనే సీజేఐ అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తానని లేఖలో స్పష్టం చేశారు. ఆ లేఖకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సానుకూలంగా స్పందించారు. జస్టిస్ ఖన్నా సీజేఐ అధికారిక నివాసంలో ఉండకుండానే పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ బీఆర్ గవాయికి సైతం జస్టిస్ చంద్రచూడ్ ఇదే విజ్ఞప్తి చేశారు. జస్టిస్ చంద్రచూడ్‌కు మే 31 వరకు అనుమతి లభించింది. అయితే, గడువు పొడిగించకూడదనే షరతుపైనే అనుమతి ఇచ్చారు. ఆ సమయం కూడా గడిచిపోయి మరో నెల పూర్తయింది. కానీ, జస్టిస్ చంద్రచూడ్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు.