Supreme Court Slams Rahul: రాహుల్ గాంధీకి సుప్రీం చీవాట్లు
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:24 AM
సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకి తీవ్రంగా మండిపడింది. దేశ చరిత్ర తెలియకుండా సమరయోధులను అపహాస్యం చేయడం అనుచితమని హెచ్చరించింది.

‘సావర్కర్ బ్రిటిష్ సేవకుడు’ అన్న వ్యాఖ్యలపై మండిపడ్డ న్యాయస్థానం
గాంధీ కూడా బ్రిటిష్ పాలకులకు ‘యువర్ సర్వెంట్’ అనే లేఖ రాసేవారని వెల్లడి
దేశ చరిత్ర తెలియనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని నిలదీసిన ధర్మాసనం
సమరయోధులను ఎగతాళి చేయరాదని హితవు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారంటూ మండిపడింది. ‘మన స్వాతంత్య్ర సమరయోధులను అపహాస్యం చేయరాదు’ అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. స్వాతంత్య్ర సమరయోధులను ఎగతాళి చేస్తూ మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ 2022లో మహారాష్ట్రలో నిర్వహించిన ర్యాలీలో సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వీర సావర్కర్‌ను కించపరిచేలా ఉన్నాయంటూ నృపేంద్ర పాండే యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ రాహుల్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ దశలో తమ జోక్యం అనవసరమని, సెషన్స్ కోర్టులోనే రివిజన్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు లఖ్‌నవూ బెంచ్ సూచించింది. ఈ నేపథ్యంలో తనపై క్రిమినల్ చర్యలను నిలిపివేయాలని కోరుతూ రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం.. రాహుల్ గాంధీని తీవ్రంగా మందలించింది. ‘‘మహాత్మా గాంధీ కూడా బ్రిటిష్ పాలకులకు లేఖ రాసినప్పుడు ‘మీ విశ్వాసపాత్రుడైన సేవకుడు’ అనే రాసేవారు. ఈ విషయం మీ కక్షిదారు(రాహుల్)కు తెలుసా? మహాత్ముడు లేఖలో రాశారని.. ఆయన్ను కూడా బ్రిటిషర్లకు సేవకుడని అంటారా? ఆ రోజుల్లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులు కూడా ‘యువర్ సర్వెంట్’ అనే రాసేవారు. మీకు(రాహుల్) దేశ చరిత్ర గురించి ఏమీ తెలియనప్పుడు.. అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు’’ అని ధర్మాసనం రాహుల్ తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వికి స్పష్టం చేసింది. ఒక ప్రముఖ రాజకీయ పార్టీ నేత అయి ఉండీ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని నిలదీసింది. మనకు స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన వారి పట్ల ఇలాగేనా వ్యవహరించేది? అని నిలదీసింది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సుమోటోగా తీసుకుంటామని హెచ్చరించింది. అయితే రాహుల్‌పై క్రిమినల్ చర్యలను నిలిపివేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఫిర్యాదుదారు నృపేంద్ర పాండేకు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.