Share News

Supreme Court: క్రైస్తవులకు ఎస్సీ హోదాపై సుప్రీం విచారణ ఆగస్టు 12కు వాయిదా

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:30 AM

క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా వర్తించదనే హైకోర్టు తీర్పును బాధితుడు సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు.

Supreme Court: క్రైస్తవులకు ఎస్సీ హోదాపై సుప్రీం విచారణ ఆగస్టు 12కు వాయిదా

న్యూఢిల్లీ, జూలై 3(ఆంధ్రజ్యోతి): క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా వర్తించదనే హైకోర్టు తీర్పును బాధితుడు సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. గురువారం జస్టిస్‌ సుందరేశ్‌, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఆ పిటిషన్‌ విచారణకు వచ్చింది. పిటిషనర్‌ అభ్యర్థన మేరకు ధర్మాసనం ఈ కేసును ఆగస్టు 12కు వాయిదా వేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్‌ చింతాడ ఆనంద్‌... తనను కులం పేరుతో దూషించి, దాడి చేసి గాయపరిచారంటూ 2021లో చందోలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


దీంతో అదే గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డితోపాటు మరో ఐదుగురుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించినవారు ఎస్సీ హోదాను కోల్పోతారన్న వాదనలతో ఏకీభవించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును చింతాడ ఆనంద్‌ మే 14న సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు.

Updated Date - Jul 04 , 2025 | 04:30 AM