Share News

Supreme Court: బిహార్‌ ఓటరు జాబితా సవరణలో ఆధార్‌ను అంగీకరించాల్సిందే

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:26 AM

బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో.. ఓటరు జాబితా సవరణకు ఆధార్‌, ఓటర్‌ ఐడీ కార్డులను చెల్లుబాటయ్యే..

Supreme Court: బిహార్‌ ఓటరు జాబితా సవరణలో ఆధార్‌ను అంగీకరించాల్సిందే

  • ఎన్నికల సంఘానికి సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ, జూలై 28: బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో.. ఓటరు జాబితా సవరణకు ఆధార్‌, ఓటర్‌ ఐడీ కార్డులను చెల్లుబాటయ్యే పత్రాలుగా అంగీకరించేందుకు విముఖత చూపుతున్న భారత ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు సోమవారం సీరియస్‌ అయింది. ‘ఒకవేళ ఫోర్జరీ చేయదలచుకుంటే ఎలాంటి పత్రాలనైనా చేయొచ్చు కదా..?’ అని ప్రశ్నించింది. ఆధార్‌తోపాటు ఓటరు ఐడీ కార్డుని చెల్లుబాటయ్యే డాక్యుమెంట్లుగా పరిగణించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే.. ఎన్నికలకు ముందు బిహార్‌లో ఓటరు ముసాయిదా జాబితా ప్రచురణపై మధ్యంతర స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈసీ చేపడుతున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై మంగళవారం (జూలై 29న) జరిగే విచారణ సందర్భంగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం వెల్లడించింది. మరోవైపు, ఈసీ తరఫు న్యాయవాది రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపిస్తూ.. ఆధార్‌ పౌరసత్వానికి రుజువు కాదని, ఇది ఓటరు జాబితాను సవరించే అంశం కాబట్టి.. ఓటర్‌ ఐడీ కార్డులపై ఆధారపడడం లేదని అన్నారు. ఇక రేషన్‌ కార్డు విషయానికి వస్తే వాటికి నకిలీలు సృష్టించే అవకాశం లేకపోలేదని తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఆధార్‌ను కేవలం గుర్తింపు పత్రంగానే పరిగణిస్తామని వెల్లడించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ భూమిపై ఏ పత్రాలను ఫోర్జరీ చేయలేరో చెప్పాలని ఈసీని ప్రశ్నించింది. బిహార్‌ ఎస్‌ఐఆర్‌లో ఆధార్‌, ఓటర్‌ ఐడీలను చెల్లుబాటయ్యే డాక్యుమెంట్ల కింద చేర్చాలని స్పష్టం చేసింది. ‘రేషన్‌ కార్డులను సులభంగా ఫోర్జరీ చేయొచ్చని మేం చెప్పగలం. కానీ.. ఆధార్‌, ఓటర్‌ ఐడీ కార్డులు అలా కాదు. వాటికి కొంత విశ్వసనీయత ఉంది. కాబట్టి ఈ పత్రాలను అంగీకరించండి’ అని ధర్మాసనం పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 04:26 AM