Priyanka Gandhi: సమగ్ర దర్యాప్తు జరగాలి: ప్రియాంక గాంధీ
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:04 PM
గుజరాత్‌లో గంభీర బ్రిడ్జి కూలిపోవడంపై ప్రియాంక గాంధీ స్పందించారు. ఇలాంటి ఘటనల పట్ల ఏమాత్రం అలసత్వం కూడదని, సమగ్ర దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం వంటి విషాదాలు నాయకత్వ లేమి, అవినీతి, అసమర్థత..

న్యూఢిల్లీ, జూలై 10: గుజరాత్‌లోని వడోదరలో నిన్న (బుధవారం) గంభీర బ్రిడ్జి కూలిపోయిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా స్పందించారు. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారన్న ప్రియాంక గాంధీ.. భారీ బ్రిడ్జి కూలడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద ప్రాంతంలో రెండవ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, అదే సమయంలో దర్యాప్తు కూడా జరగాలని ప్రియాంక గాంధీ అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ అంశంపై స్పందించారు. కేంద్రంలోని బిజెపి నాయకత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గుజరాత్ వంతెన కూలిపోవడం, అహ్మదాబాద్ విమాన ప్రమాదం వంటి ఇటీవలి విషాదాలు నాయకత్వ సంక్షోభం, అవినీతి, అసమర్థత ఫలితంగా జరిగాయని ఆరోపించారు.
వడోదర కలెక్టర్ అనిల్ ధమేలియా విలేకరులతో మాట్లాడుతూ, 'ఇవాళ మరో మూడు మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య 15కి చేరుకుంది. నలుగురు గల్లంతయ్యారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) 4 కి.మీ. మేర గాలింపు, రక్షణ చర్యలు నిర్వహిస్తున్నాయి' అని చెప్పారు. నదిలోకి పడిపోయిన రెండు వాహనాల గురించి ప్రజల నుండి వివరాలను కోరుతున్నామన్నారు.
వర్షం పడుతుండటంతో, నదిలో నీటి మట్టం పెరిగిందని కలెక్టర్ తెలిపారు. అయితే, విరిగిన వంతెనపై వేలాడుతున్న ట్రక్కు గురించి అడిగినప్పుడు, 'ఇది ఖాళీ ట్యాంకర్. మేము దానిని తరలిస్తే, అది కింద పడిపోవచ్చు. సరిగ్గా కిందనే సహాయక చర్యలు జరుగుతున్నందున లారీని స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం' అన్నారు.
ఇలా ఉండగా, బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య నేడు 15కి పెరిగిందని, ఇవాళ మరో మూడు మృతదేహాలను వెలికితీసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గల్లంతైన నలుగురి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వడోదర - ఆనంద్‌లను కలిపే భారీ గంభీర బ్రిడ్జిలో కొంత భాగం కూలిపోయి దిగువన ఉన్న మహిసాగర్ నదిలో పడిపోయిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
స్కూళ్లలో నో పాలిటిక్స్.. అంతా బయటే: మంత్రి లోకేష్
మెగా పీటీఎం.. స్టూడెంట్స్‌కు పాఠం చెప్పిన సీఎం
Read Latest AP News And Telugu News