Sonia Gandhi: దౌత్య నీతికి దూరంగా జరిగారా... కేంద్రాన్ని ప్రశ్నించిన సోనియాగాంధీ
ABN , Publish Date - Jun 21 , 2025 | 06:28 PM
ఇజ్రాయెల్‌తో పాటు స్వతంత్ర పాలిస్తీనాతో రెండుదేశాల మధ్య శాంతియుత పరిష్కారానికి భారత్ చిరకాలంగా కట్టుబడి ఉందని, దానికి కేంద్రం దూరమైనట్టు కనిపిస్తోందని సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-పాలస్తీనా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంపై కేంద్ర ప్రభుత్వ మౌనాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi) ప్రశ్నించారు. మౌనంగా ఉండటమంటే మన వాణిని వినిపించే అవకాశాన్ని వదులుకోవడమే కాక, విలువలకు లొంగిపోవడం అవుతుందని అన్నారు. గతంలో గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడు కూడా భారత ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందని, ఇప్పుడు ఇరాన్‌తో యుద్ధం సమయంలోనూ మౌనాన్నే ఆశ్రయిస్తోందని ఒక జాతీయ పత్రిక రాసిన వ్యాసంలో సోనియాగాంధీ విమర్శించారు.
ఇజ్రాయెల్‌తో పాటు స్వతంత్ర పాలిస్తీనాతో రెండుదేశాల మధ్య శాంతియుత పరిష్కారానికి భారత్ చిరకాలంగా కట్టుబడి ఉందని, దానికి కేంద్రం దూరమైనట్టు కనిపిస్తోందని సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు. ''కేంద్రం అనుసరిస్తున్న వైఖరి భారతదేశ నైతిక, వ్యూహాత్మక సంప్రదాయం నుంచి దూరంగా జరిగినట్టు కనిపిస్తోంది' అని అన్నారు. ఇరాన్ గడ్డపై బాంబుదాడులు, మారణహోమాన్ని సోనియాగాంధీ ఖండించారు. ఇలాంటి చర్యల వల్ల మరింత అస్థిరత తలెత్తి, తదుపరి ఘర్షణలకు దారితీస్తాయని అన్నారు. భారత్‌కు ఇరాన్ చిరకాల మిత్రుడని ఆమె పేర్కొన్నారు. చరిత్రను గమనిస్తే, జమ్మూకశ్మీర్‌తో సహా పలు కీలక పరిస్థితుల్లో ఇరాన్ బాసటగా నిలిచినట్టు తెలుస్తుందన్నారు. 1994లో కశ్మీర్ అంశంపై మానవ హక్కులకు సంబంధించి యూఎన్ కమిషన్ వద్ద ఇండియాకు క్లిష్ట పరిస్థితి ఏర్పడి, తీర్మానం ముందుకు వచ్చినప్పుడు దాన్ని బ్లాక్ చేసేందుకు ఇరాన్ సహకరించిందని అన్నారు. ఇటీవల కాలంలో ఇండియా-ఇజ్రాయెల్ వ్యూహాత్మక సంబంధాలను ప్రస్తావిస్తూ, భారత్ దౌత్యపరంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉద్రిక్తలు తగ్గడానికి, శాంతి నెలకొనేందుకు వారధిగా కృషి చేయాలని, నైతిక బాధ్యత వహించాలని అన్నారు. పశ్చిమ ఆసియాలో గణనీయంగా భారతీయులు నివసిస్తున్నారని, ఘర్షణలు కొనసాగితే వారి జీవితాలపై కూడా ప్రభావం పడుతుందని అన్నారు.
నెతన్యాహు, ట్రంప్‌పై విమర్శలు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని ప్రభుత్వానికి చిరకాలంగా శాంతిని బలహీనపరిచి, తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న చరిత్ర ఉందని అన్నారు. ఒడంబడికల కంటే ఉద్రిక్తతలను పెంచడానికే ఆయన ఇష్టపడతారని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సైతం సోనియా విమర్శలు గుప్పించారు. ఘర్షణలు జరుగుతున్న సమయంలో ఇరాన్‌పై కఠిన వైఖరి ప్రదర్శిస్తూ అమెరికా మిలటరీని కూడా రంగంలోకి దింపేందుకు యోచన చేస్తున్నారని అన్నారు.
ఇవి కూడా చదవండి..
కూర్పు మనది.. లాభాలు చైనావి.. మేక్ ఇన్ ఇండియాపై రాహుల్ విసుర్లు
సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించం...తేల్చిచెప్పిన అమిత్‌షా
For National News And Telugu News