Share News

SIR Unrest in Bengal: బెంగాల్‌లో ఎస్ఐఆర్ సెగలు.. బీఎల్ఓల ఆందోళన ఉధృతం

ABN , Publish Date - Dec 01 , 2025 | 09:40 PM

బీఎల్ఓ అధికార్ రక్షా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది. బీఎల్ఓలకు మెరుగైన పని వాతావరణం కల్పించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఓలపై తీవ్రమైన పని ఒత్తిడి మోపుతున్నారని కమిటీ ఆరోపిస్తోంది.

SIR Unrest in Bengal: బెంగాల్‌లో ఎస్ఐఆర్ సెగలు.. బీఎల్ఓల ఆందోళన ఉధృతం
SIR Protests in Kolkata

కోల్‌కతా: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సోమవారంనాడు ఇటు పార్లమెంటులోనూ, అటు వీధుల్లోనూ తీవ్ర గంగరగోళం చోటుచేసుకుంది. ఎస్ఐఆర్‌పై తక్షణం చర్చ జరపాలంటూ విపక్షాలు పార్లమెంటులో సభాకార్యక్రమాలను అడ్డుకోగా, పశ్చిమబెంగాల్‌లో బూత్ స్థాయి అధికారులు (BLOs) రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కోల్‌కతా, ఇతర ప్రాంతాల్లో వందలాది మంది బీఎల్ఓలు ఎన్నికల కమిషన్ కార్యాలయం వెలుపల ఆందోళనకు దిగారు. కొందరు ఈసీ కార్యాలయంలో చొరబడేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి.


బీఎల్ఓల నిరసన ఎందుకంటే..

బీఎల్ఓ అధికార్ రక్షా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది. బీఎల్ఓలకు మెరుగైన పని వాతావరణం కల్పించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఓలపై తీవ్రమైన పని ఒత్తిడి మోపుతున్నారని కమిటీ ఆరోపిస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైనప్పటినప్పటి నుంచి ఐదుగురు బీఎల్ఓలు పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడినట్టు చెబుతోంది.


వాళ్లు బీఎల్ఓలు కాదు.. బీజేపీ కౌంటర్

కాగా, కోల్‌కతాలో జరిగిన బీఎల్ఓల నిరసన ప్రదర్శనలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. అది బీఎల్ఓల నిరసన కాదని, టీఎంసీ కార్యకర్తలే ఈ ప్రదర్శనలకు నేతృత్వం వహిస్తున్నారని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా దేశాన్నే వణికిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెబుతున్నారని, కానీ 2026లో బెంగాల్‌లో ఆమె ప్రభుత్వ పునాదులే కదలిపోనున్నాయని అన్నారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రెండో విడత ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుండగా, వివాదాల నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును మరో వారం పాటు ఎలక్షన్ కమిషన్ పొడిగించింది. ఆ ప్రకారం డిసెంబర్ 11వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. ముసాయిదా ఓటర్ల జాబితాను డిసెంబర్ 16న విడుదల చేస్తారు. 2026 ఫిబ్రవరి 14న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు.


ఇవి కూడా చదవండి..

ఎస్ఐఆర్‌పై చర్చకు మాకు కొంత సమయం కావాలి

శునకంతో పార్లమెంటుకు.. వివాదంలో రేణుకా చౌదరి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 01 , 2025 | 09:42 PM