Minister JP Nadda: భారత్‌కు సౌదీ అరేబియా ఎరువులు
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:47 AM
ఖరీఫ్ సీజన్‌లో ఏర్పడిన కొరతను తీర్చేందుకు సౌదీ అరేబియా.. భారత్‌కు ఎరువులు సరఫరా చేయనుంది...

సౌదీలో పర్యటించిన కేంద్ర మంత్రి నడ్డా
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): ఖరీఫ్ సీజన్‌లో ఏర్పడిన కొరతను తీర్చేందుకు సౌదీ అరేబియా.. భారత్‌కు ఎరువులు సరఫరా చేయనుంది. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి జేపీ నడ్డా ఆదివారం సౌదీ అరేబియాలో పర్యటించారు. అత్యధికంగా యూరియాతోపాటు ఇతర ఎరువులను ఉత్పత్తి చేసే క్రిబ్కో, ఇతర సంస్థల ప్రతినిధి బృందం, భారతీయ రాయబారి సోహైల్ అహ్మద్ ఖాన్‌తో కలిసి రాస్ అల్ ఖైర్ ప్రాంతంలో ఉన్న గనులు, ఎరువుల సంస్థ మాదెన్‌కు చెందిన ఫ్యాక్టరీని సందర్శించారు. శుక్రవారం రాత్రి సౌదీకి వచ్చిన మంత్రి ఇక్కడి అధికారులు, వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఎరువుల ఉత్పత్తి, సరఫరాల తదితరాలపై వారితో చర్చించారు. యూరియా, ఇతర ఎరువులను మాదెన్.. భారత్‌కు ఎగుమతి చేస్తుంది. భారత్‌లో ఈ ఖరీఫ్ సీజన్‌లో కేంద్రం 52లక్షల టన్నుల యూరియా వినియోగాన్ని అంచనావేయగా, ఇంకా నాట్లు పూర్తవకముందే 48లక్షల టన్నుల విక్రయం జరిగిందని, పంట చేతికొచ్చే సరికి యూరియా ఇంకా అవసరమవుతుందని ప్రభుత్వం అంచనావేస్తోంది. ప్రతి సీజన్‌లో రాష్ట్రాల నుంచి ఎరువులకు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడడంతో ఎరువులు ప్రత్యేకించి.. యూరియా, పొటాష్ సమస్యను పరిష్కరించే దశగా మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ సౌదీ అరేబియాతో అనేకసార్లు చర్చలు జరిపి వెళ్లారు కూడా. రష్యా, మొరాకో, జోర్డాన్, ఈజిప్టు, చైనా దేశాలు భారతీయ ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకును అందిస్తున్నా భౌగోళికరీత్యా ధర, సమయం కారణాన భారత్.. సౌదీ వైపు మొగ్గు చూపుతోంది. సౌదీ, ఇతర అరబ్బు దేశాల నుంచి ఎగుమతయ్యే ఎరువుల్లో అత్యధిక భాగం కాకినాడ, విశాఖపట్టణం, పారాదీప్ నౌకాశ్రయాలకు చేరుకుంటాయి.