Share News

Family Feud Escalates: షర్మిల.. కవిత.. రోహిణి

ABN , Publish Date - Nov 17 , 2025 | 03:53 AM

మరో రాజకీయ కుటుంబంలో కుటుంబ రాజకీయాల చిచ్చు బయటపడింది. మరో ఆడపడుచును పుట్టిల్లు పొమ్మంది.

Family Feud Escalates: షర్మిల.. కవిత.. రోహిణి

  • రాజకీయ కుటుంబాల్లో.. కుటుంబ రాజకీయాల చిచ్చు

  • తేజస్వీ యాదవ్‌, ఆయన సన్నిహితులు

  • నన్ను తీవ్రంగా అవమానించారు

  • మురికిదానినని.. డబ్బులు, పదవి కోసమే నాన్న(లాలూ)కు కిడ్నీ ఇచ్చానని తిట్టారు

  • నన్ను చెప్పుతో కొట్టబోయారు: లాలూ కుమార్తె, తేజస్వీ సోదరి రోహిణి వ్యాఖ్యలు

  • లాలూ ఇంటిని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు

పట్నా, నవంబరు 16: మరో రాజకీయ కుటుంబంలో కుటుంబ రాజకీయాల చిచ్చు బయటపడింది. మరో ఆడపడుచును పుట్టిల్లు పొమ్మంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ సోదరి షర్మిల, తెలంగాణలో కేటీఆర్‌ సోదరి కవిత తరహాలోనే తాజాగా బిహార్‌లో ఆర్జేడీ చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె, తేజస్వియాదవ్‌ సోదరి రోహిణి ఆచార్య తమ కుటుంబం నుంచి బయటికి వచ్చారు. తేజస్వియాదవ్‌, ఆయన సహాయకులు కలిసి తనను దారుణంగా అవమానించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇకపై ఆ కుటుంబంతో, ఆర్జేడీ పార్టీతో సంబంధాలు తెంచుకుంటున్నాననీ ప్రకటించారు. అంతేకాదు లాలూ మరో ముగ్గురు కుమార్తెలు కూడా పట్నాలోని లాలూ నివాసాన్ని వదిలేసి.. తమ కుటుంబాలతో ఢిల్లీ వెళ్లిపోయారు. ఇంటి ఆడపడుచులు ఆవేదనతో బయటికి వచ్చిన ఈ మూడు కుటుంబ పార్టీలు కూడా దారుణ పరాజయాల పాలవడం గమనార్హం.


చెప్పు చూపించి.. అవమానించి..

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణ పరాజయం పాలైన మరుసటి రోజే.. ఆర్జేడీ పార్టీని, లాలూ కుటుంబాన్ని వీడుతున్నట్టు రోహిణి ఆచార్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం ఆమె ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘ఎక్స్‌’లో సంచలన ఆరోపణలు చేశారు. సోదరుడు తేజస్వియాదవ్‌, ఆయన సన్నిహితులు తనను మురికిదానివంటూ తీవ్రంగా తిట్టారని, చెప్పుతో కొట్టడానికి సిద్ధమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణ ఓటమికి తేజస్వియాదవ్‌ సన్నిహితులు హరియాణాకు చెందిన ఎంపీ సంజయ్‌ యాదవ్‌, యూపీకి చెందిన రమీజ్‌ కారణమని ఆరోపించారు. ‘‘నిన్న ఓ సోదరి, ఓ కుమార్తె తీవ్రంగా అవమానం ఎదుర్కొంది. నన్ను మురికిదాన్ని అని అసభ్యంగా తిట్టారు. కొట్టేందుకు చెప్పు ఎత్తారు. నేను నా ఆత్మగౌరవం విషయంలో రాజీ పడలేదు. సత్యాన్ని వాళ్లకు లొంగనీయలేదు. కేవలం అందుకోసమే అవమానాలను ఎదుర్కొన్నాను. ఏడుస్తున్న తల్లిదండ్రులను, అక్కచెల్లెళ్లను నిస్సహాయ స్థితిలో వీడి బయటికి వచ్చాను. డబ్బులు, పార్టీ టికెట్‌ కోసం నా మురికి కిడ్నీని మా నాన్నకు ఇచ్చానన్నారు. వివాహమైన ఆడపిల్లలు తమ పుట్టింటిలో సోదరుడు ఉంటే.. మీ తండ్రిని కాపాడటానికి ఎప్పుడూ, ఎలాంటి సాయం చేయకండి. దానికి బదులు మీ సోదరుడినో, సోదరుడి హరియాణా స్నేహితుడినో (ఎంపీ సంజయ్‌ యాదవ్‌ను ఉద్దేశిస్తూ) కిడ్నీ ఇవ్వాలని చెప్పండి. అందరు అక్కచెల్లెళ్లు, కూతుళ్లు మీ అత్తింటిని, మీ కుటుంబాలను, మీ పిల్లలను బాగా చూసుకోండి. కేవలం మీ గురించే ఆలోచించుకోండి. నేను నా కుటుంబాన్ని, నా ముగ్గురు పిల్లలను చూసుకోకుండా పెద్ద పాపం చేశాను. నా భర్త, అత్తింటి వారి అనుమతి తీసుకోకుండా నా తండ్రికి కిడ్నీ ఇచ్చాను. దేవుడి లాంటి తండ్రి (లాలూ)ను కాపాడుకోవడానికి ఆ పని చేశాను. నాకు శాపం తగిలింది. ఇప్పుడు మురికి దానిని, మురికి కిడ్నీ అని మాటలు పడుతున్నాను. వాళ్లు నన్ను పుట్టింటి నుంచి తరిమేశారు. నన్ను అనాథను చేశారు’’ అని రోహిణి ఆచార్య ఆవేదన వ్యక్తం చేశారు. 47 ఏళ్ల రోహిణి ఆచార్య లాలూ రెండో కుమార్తె. వైద్యురాలు అయిన ఆమె భర్తతో కలసి తొలుత సింగపూర్‌లో స్థిరపడ్డారు. లాలూ రెండు కిడ్నీలు దెబ్బతినడంతో.. ఆమె తన కిడ్నీని తండ్రికి ఇచ్చారు. కొంతకాలం నుంచి పట్నాలోనే ఉంటున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో సరణ్‌ స్థానంలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు.


లాలూ ఇంటిని వీడిన మరో ముగ్గురు

లాలూకు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో రెండో కుమార్తె రోహిణి తీవ్ర ఆరోపణలతో బయటికి వచ్చారు. ఈ క్రమంలో లాలూ మరో ముగ్గురు కుమార్తెలు రాజ్యలక్ష్మి, రాగిణి, చందా కూడా పట్నాలోని నివాసం నుంచి తమ కుటుంబాలను తీసుకుని ఆదివారమే ఢిల్లీకి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. లాలూ కుమారుల్లో పెద్దవాడైన తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ను పలు పరిణామాల నేపథ్యంలో కొన్ని నెలల క్రితం ఆర్జేడీ నుంచి బహిష్కరించారు. దానితో ఆయన జనశక్తి జనతాదళ్‌ (జేజేడీ) పేరిట పార్టీ స్థాపించారు. ఇటీవలి ఎన్నికల్లో మహువా నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. చిన్నవాడైన తేజస్వియాదవ్‌ ఆర్జేడీని నడిపిస్తున్నారు. కాగా, తన సోదరి రోహిణి ఆవేదన విని తన గుండె తరుక్కుపోయిందని తేజ్‌ప్రతాప్‌ పేర్కొన్నారు. తనను ఎంతగా ఇబ్బందిపెట్టినా తట్టుకున్నానని, కానీ సోదరిని ఇలా అవమానించడాన్ని సహించలేకపోతున్నానని చెప్పారు.

Updated Date - Nov 17 , 2025 | 06:51 AM