Share News

Nepal: రాముడు మావాడే.. శివుడూ మావాడే

ABN , Publish Date - Jul 08 , 2025 | 02:45 PM

హిందూ పురాణాల్లో పేర్కొనే శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్ నుంచి వచ్చిన వారేనని కేపీ శర్మ ఓలి చెప్పారు. ఇది తానేదో చెబుతున్నది కాదని, విశ్వామిత్రుడు చతరాలో పుట్టినట్టు వాల్మీకి రామాయణం చెబుతోందని అన్నారు.

Nepal: రాముడు మావాడే.. శివుడూ మావాడే
Nepal PM KP Sharma Oli

ఖాట్మండు: నేపాల్(Nepal) ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి (KP Sharma Oli) మరోసారి శ్రీరాముడి జన్మస్థలంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు నేపాలీ గడ్డ పైనే పుట్టాడని అన్నారు. రాముడే కాకుండా, శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని పేర్కొన్నారు. ఇది తాను సొంతంగా చెబుతున్నది కాదని, వాల్మీకి రామాయణంలోనే ఉందని చెప్పారు. ఖాట్మండులో సీపీఎన్-యూఎంఎల్ పర్యాటక, పౌర విమానయాన శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


వాల్మీకి రామాయణం ఆధారంగానే తాను ఈ మాట చెబుతున్నానని, ఈ విషయం ప్రచారం చేయడానికి దేశ ప్రజలు ఏమాత్రం సంకోచించాల్సి పని లేదని అన్నారు. రామ జన్మస్థలంపై ఎవరైనా వేరే కథలను ఎలా స్పష్టించగలరని ఓలి ప్రశ్నించారు. రాముడు పుట్టింది ఇక్కడే, ఆయన పుట్టిన స్థలం కూడా ఇక్కడే ఉందని చెప్పారు. రాముడు ఎందరికో దైవం అయినప్పటికీ దీనిని నేపాల్ చురుకుగా ప్రచారం చేయలేకపోయిందని అన్నారు. 'దీనిపై మాట్లాడేందుకు మనం సంకోచించాం. తగినంతగా ప్రచారం చేయలేకపోయాం. ఏదేమైనా రాముడిని ఆరాధించే వారికి ఆయన పుట్టిన స్థలం చాలా పవిత్రమైనది' అని నేపాల్ ప్రధాని అన్నారు. హిందూ పురాణాల్లో పేర్కొనే శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్ నుంచి వచ్చిన వారేనని ఆయన చెప్పారు. ఇది తానేదో చెబుతున్నది కాదని, విశ్వామిత్రుడు చతరాలో పుట్టినట్టు వాల్మీకి రామాయణం చెబుతోందని అన్నారు.


కాగా, నేపాల్ ప్రధాని ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2020 జూలైలో ఆయన నిజమైన అయోధ్య నేపాల్‌లోని చిత్వాన్ జిల్లా థోరిలో ఉంది అన్నారు. రామ జన్మభూమి నేపాల్‌లో ఉందని, చారిత్రక ప్రాంతాలను ఎక్కడెక్కడో ఉన్నట్టు చెప్పేవన్నీ కట్టుకథలేనని అన్నారు. వాల్మీకి ఆశ్రమం, వాల్మీకి నివసించింది కూడా నేపాల్‌లోనేనని, రిడీ ప్రాంతంలోనే దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశారని అన్నారు. 'రాముడు ఇండియన్ కాదు, అయోధ్య నేపాల్‌లో ఉంది' అని ఓలీ ప్రకటించారు. రామాయణంపై విస్తృతమైన భౌగోళిక, సాంస్కృతిక అధ్యయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఓలి వ్యాఖ్యలపై గతంలోనూ సొంత పార్టీ నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.


పాక్‌కు చైనా సాయం.. కథ మొత్తం బయటపెట్టిన భారత్!

రూ.200 మోసం చేశాడు.. కట్ చేస్తే 30 ఏళ్ల తర్వాత ఊహించని షాక్..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 04:34 PM