Parliament Winter Session: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్షం భేటీ..
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:05 PM
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలంటూ విపక్ష పార్టీలకు చెందిన నేతలను కేంద్రం కోరింది.
న్యూఢిల్లీ, నవంబర్ 30: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి అంటే సోమవారం (డిసెంబర్ 1వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ఆదివారం న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలంటూ విపక్ష పార్టీలకు చెందిన సభ్యులను కేంద్రం కోరింది. అలాగే ఈ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టిన బిల్లులను ఆమోదించేందుకు మద్దతు ఇవ్వాలని వారికి విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘవాల్, ఎల్. మురుగన్, అనుప్రియ పటేల్‌తోపాటు జైరామ్ రమేశ్ (కాంగ్రెస్), లావు శ్రీకృష్ణ దేవరాయలు (టిడిపి), మిథున్ రెడ్డి (వైసీపీ), సురేష్ రెడ్డి (బిఆర్ఎస్), బాల శౌరి(జనసేన), కమల్ హాసన్, డెరాక్ ఒబ్రెయిన్, తిరుచ్చి శివ, టి.ఆర్ బాలు, కళ్యాణ్ బెనర్జీ సహా పలు పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు.
ఈ సమావేశాల్లో కొత్తగా మొత్తం 10 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నాలుగు ఆర్థిక సవరణ బిల్లులతో పాటు కాలం చెల్లిన మొత్తం 120 చట్టాలను రద్దు చేసే బిల్లు,హోం, అణుశక్తి, విద్య, రహదారులకు సంబంధించి మరో ఐదు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అణుశక్తి ని సమర్థవంతంగా వినియోగించుకునేలా చట్టం చేసేందుకు బిల్లును ప్రవేశపెట్టనుంది. దేశంలో నేషనల్ హైవేలు (జాతీయ రహదారులు) వేగవంతంగా పూర్తయ్యేలా పారదర్శకతో కూడిన భూసేకరణ కోసం కీలకమైన చట్ట సవరణ బిల్లును సైతం ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. భారత ఉన్నత విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు కీలక బిల్లుతోపాటు శాస్త్ర, సాంకేతిక విద్యాసంస్థలు, పరిశోధన రంగం, ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పే లక్ష్యంగా, సమన్వయంతో పనిచేసేందుకు ఈ ఉన్నత విద్యా కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అలాగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి పార్లమెంట్ సెలెక్ట్ కమిటీల పరిశీలనకు పంపిన మరో రెండు బిల్లులు ఈ శీతాకాల సమావేశాల్లో కేంద్రం ఆమోదించేందుకు రంగం సిద్ధం చేసింది.
ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాంపై వివిధ రాజకీయ పార్టీల సభ్యులకు ఆయా పార్టీల అధినేతలు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత.. అంటే 2014 నుంచి ఆయన పలుమార్లు ప్రధాని పీఠాన్ని చేపడుతున్నారు. నాటి నుంచి నేటి వరకు అతి తక్కువ రోజులు శీతాకాల సమావేశాలు మాత్రం ఈ సారే జరగనున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఈవీఎంలు, ఎస్ఐఆర్, మావోయిస్టులపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తదితర అంశాలను లక్ష్యం చేసుకుని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకొంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం
భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఈ ప్రయోజనాలు..?
Read Latest National News and National News