Railway Safety: రైలు బోగీల్లో సీసీ కెమెరాలు
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:13 AM
ప్రయాణికుల భద్రతను పెంచే దిశగా రేల్వే శాఖ కీలక ముందడుగు వేసింది...

ఒక్కో కోచ్‌లో 4 చొప్పున ఏర్పాటు
దేశవ్యాప్తంగా 74 వేల బోగీల్లో..
లోకోమోటివ్‌ల్లో కూడా రెండేసి..
నార్తర్న్ రైల్వే పరిధిలో పైలట్ ప్రాజెక్టు
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆమోదం
న్యూఢిల్లీ, జూలై 13: ప్రయాణికుల భద్రతను పెంచే దిశగా రేల్వే శాఖ కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 74 వేల ప్యాసింజర్ కోచ్‌లతో పాటు 15 వేల లోకోమోటివ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమోదం తెలిపారు. నార్తర్న్ రైల్వే పరిధిలో లోకో ఇంజన్లు, కోచ్‌లలో ప్రయోగాత్మకంగా సీసీటీవీ కెమెరాలను అమర్చి, వాటి పనితీరును పరిశీలించిన తరువాత ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో రైళ్లలో నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని రైల్వే శాఖ భావిస్తోంది.
సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఇలా..
ప్రతి ప్యాసింజర్ కోచ్‌లో నాలుగు డోమ్- రకం సీసీటీవీ కెమెరాలు (ప్రతి ప్రవేశ మార్గంలో రెండు) ఉంటాయి. ప్రతి లోకోమోటివ్ కోచ్‌లలో ముందు, వెనుక, రెండు వైపులా ఒక్కో కెమెరా ఉంటుంది. ప్రతి లోకోమోటివ్ క్యాబ్‌లో (ముందు, వెనుక) ఒక డోమ్ సీసీటీవీ కెమెరా, రెండు డెస్క్ మౌంటెడ్ మైక్రోఫోన్‌లు అమరుస్తారు. గంటకు 100 కి.మీ వేగంతో వెళ్తున్న రైలులో, తక్కువ వెలుతురులోనూ స్పష్టమైన, అధిక నాణ్యత గల ఫుటేజీని అందించేలా కెమెరాలు ఉండాలని అధికారులను రైల్వేశాఖ ఆదేశించింది. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో ప్రయాణికుల గోప్యతకు భంగం కలగకుండా తలుపుల వద్ద మాత్రమే వాటిని అమర్చనున్నారు. ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికే ఈ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ఆధునికీకరణ ప్రయత్నాలు భారతీయ రైల్వే ప్రయాణికులకు సురక్షితమైన, పటిష్టమైన ప్రయాణ అనుభవాన్ని అందించాలనే నిబద్ధతకు నిదర్శనం అని అధికారులు పేర్కొన్నారు.
రైల్వే రిక్రూట్‌మెంట్‌లో ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు
ఉద్యోగ నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా రూపొందించాలని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్టు నిర్ణయించింది. రాబోయే నాలుగు నెలల్లో రైల్వేలోని అన్ని నియామక కేంద్రా ల్లో ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు సాంకేతికతను ప్రవేశపెట్టనుంది. దీంతో రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మోసాలను అరికట్టడమే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ ఆధార్ ఈ-కేవైసీని ఉపయోగించుకుని, అభ్యర్థుల గుర్తింపును పలు దశల్లో ధ్రువీకరిస్తుంది. దరఖాస్తుల సమర్పణ సమయంలో, పరీక్ష రోజున, చివరికి పరీక్ష పూర్తయ్యాక కూడా.. పరీక్షకు హాజరైన వ్యక్తి, దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఒకరేనా, కాదా అని దీని ద్వారా నిర్ధారిస్తారు.