JK Statehood: కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించండి.. మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ
ABN , Publish Date - Jul 16 , 2025 | 02:56 PM
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని గత ఐదేళ్లుగా అక్కడి ప్రజలు కోరుతున్నారని మోదీకి రాసిన లేఖలో కాంగ్రెస్ అగ్రనేతలు ఇరువురు కోరారు. దీనితో పాటు లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు.
'రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను మంజూరు చేస్తూ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని మేము కోరుతున్నాం. లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం' అని ఆ లేఖలో రాహుల్, ఖర్గే పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని గత ఐదేళ్లుగా అక్కడి ప్రజలు కోరుతున్నారని ఆ లేఖలో కాంగ్రెస్ అగ్రనేతలు ఇరువురు కోరారు. దీనితో పాటు లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని, ఈ రెండు డిమాండ్లు చట్టబద్ధమైనవని, అవి రాజ్యాంగపరంగా, ప్రజాసామ్యపరంగా ప్రజలకున్న హక్కులని సూచించారు. కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్ర పతిపత్తి కల్పించిన ఉదాహరణలు గతంలో ఉన్నాయని, అయితే జమ్మూకశ్మీర్ విషయంలో ఇందుకు భిన్నంగా జరిగిందని, పూర్తి స్థాయి రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతానికి తగ్గించి విభజించడం మొదటిసారిగా జరిగిందని ఆ లేఖలో ఖర్గే, రాహుల్ పేర్కొన్నారు.
'రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యక్తిగతంగా మీరు పలుమార్పు చెప్పారు. 2024 మే 19న భువనేశ్వర్ ఇంటర్వ్యూలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని మీరు చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని పార్లమెంటులో చెప్పినట్టు కూడా శ్రీనగర్‌లో 2024 సెప్టెంబర్ 19న జరిగిన ర్యాలీలో మీరు పునరుద్ఘాటించారు' అని కాంగ్రెస్ అగ్రనేతలిరువురు ప్రధానికి గుర్తుచేశారు. 370వ అధికరణ సమయంలోనూ సాధ్యమైనంత త్వరగా జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశంలో కేంద్రపాలిత జమ్మూకశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించే చట్టాన్ని తీసుకురావాలని ప్రధానికి వారు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
బోయింగ్ విమానాల్లో ఇంధన మీటపై ముందే హెచ్చరించిన యూకే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి