Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:32 AM
గత (2024) లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. కనీసం 70 నుంచి వంద స్థానాల్లో ఫలితాలను తారుమారు చేశారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎన్నికల ఫలితాలను ఎలా తారుమారు చేశారో చెప్పడానికి మా వద్ద నూటికి నూరు శాతం ఆధారాలున్నాయి.

70-100 స్థానాల్లో ఫలితాలు తారుమారు
మా వద్ద వంద శాతం ఆధారాలున్నాయి
వాటిని త్వరలోనే బయటపెడతాం
ఇది అణుబాంబు వంటిది.. ఇక ప్రకంపనలే
పూర్తిగా నిర్వీర్యమైన ఎన్నికల కమిషన్
కాంగ్రెస్ లీగల్ సదస్సులో రాహుల్ గాంధీ
సాగు చట్టాలను వ్యతిరేకించవద్దని అప్పట్లో జైట్లీ తనను హెచ్చరించారని వెల్లడి
ఖండించిన అరుణ్ జైట్లీ తనయుడు
న్యూఢిల్లీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ‘‘గత (2024) లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. కనీసం 70 నుంచి వంద స్థానాల్లో ఫలితాలను తారుమారు చేశారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎన్నికల ఫలితాలను ఎలా తారుమారు చేశారో చెప్పడానికి మా వద్ద నూటికి నూరు శాతం ఆధారాలున్నాయి. వాటిని త్వరలో బయటపెడతాం. ఇది ఓ ఆటంబాంబు వంటిది’’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికల్లో రిగ్గింగ్‌పై తమకు ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయని, కానీ, ఇప్పుడు ఆధారాలు లభించాయని తెలిపారు. రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కాంగ్రెస్ పార్టీ న్యాయ, మానవ హక్కులు, సమాచార హక్కు విభాగం శనివారం వార్షిక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మోదీ అతి తక్కువ మెజారిటీతో ప్రధాన మంత్రి అయ్యారని, 10-15 నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగి ఉండకపోతే ఆయన ప్రధాన మంత్రి అయి ఉండేవారు కాదని వ్యాఖ్యానించారు. ‘‘అసలు దేశంలో ఎన్నికల కమిషన్ అనేదే లేదన్నట్లుగా మా వద్ద ఆధారాలున్నాయి. వాటిని దేశం మొత్తానికి చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ దాదాపు ఆరు నెలలపాటు కష్టపడి ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు సంపాదించింది. ఉదాహరణకు, ఓ నియోజకవర్గంలో 6.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కానీ, వారిలో లక్షన్నర మంది బోగస్ ఓటర్లే’’ అని రాహుల్ వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ ఎలా చేయవచ్చు.. ఎలా చేశారనే విషయాన్ని తాము నిరూపిస్తామని చెప్పారు. ఆ డేటాను తాము విడుదల చేసినప్పుడు ప్రకంపనలు తప్పవని చెప్పారు. ‘‘మేం ఈ ఆధారాలను కొంతమందికి చూపించినప్పుడు వాళ్లు కుర్చీ నుంచి కిందకు పడిపోయారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. కానీ, ఇది సాధ్యం. ఇదే జరిగింది. ఇది నిజం’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల కమిషన్ పూర్తిగా నిర్వీర్యం
దేశంలో ఎన్నికల వ్యవస్థ ఇప్పటికే చచ్చిపోయిందని రాహుల్ ఆరోపించారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు జరిగిన తర్వాత నాలుగు నెలల్లోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగు నెలల్లో కోటి మంది కొత్త ఓటర్లను చేర్చారు. వారిలో అత్యధికులు బీజేపీకే ఓటు వేశారు’’ అని ఆరోపించారు. 2014 నుంచే ఎన్నికల ఫలితాలపై తమకు సందేహాలు ఉన్నాయని, మరీ ముఖ్యంగా, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో ఘన విజయాలు బీజేపీ మేనేజ్ చేసిందని, కానీ, టర్నింగ్ పాయింట్ మాత్రం ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలని వ్యాఖ్యానించారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మేం గెలిచాం. కానీ, కేవలం నాలుగు నెలల్లోనే అక్కడ మేం ఓడిపోవడమే కాదు.. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాం. మూడు ప్రధాన పార్టీలు కనిపించకుండాపోయాయి. అప్పటి నుంచే ఎన్నికల అక్రమాలపై మేం సీరియ్‌సగా దృష్టిసారించాం’’ అని వివరించారు. ‘నువ్వు నిప్పుతో చెలగాటం ఆడుతున్నావ్’ అని తన సోదరి ప్రియాంక గాంధీ తనను హెచ్చరించారని, పిరికివాళ్లను చూసి భయపడవద్దని తన కుటుంబం తనకు నేర్పిందని చెప్పారు. రఫేల్ ఒప్పందంలో ప్రధాన మంత్రి కార్యాలయం, జాతీయ భద్రతా సలహాదారు జోక్యం ఉందని డాక్యుమెంట్లు చెబుతున్నాయని, ఇలాంటి డాక్యుమెంట్ మరో దేశంలో బయటపడి ఉంటే.. ప్రభుత్వం కుప్పకూలిపోయేదని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కానీ, మన దేశంలో ఏమీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రాహుల్ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. అధికారులను బెదిరించడానికి విపక్ష నేత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. అలాంటి ఆరోపణలు ఎన్నికల యంత్రాంగాన్ని తీవ్ర ఒత్తిడి గురిచేయిస్తాయని వ్యాఖ్యానించింది.
కావాలనే తొలగించారు: ఖర్గే
బిహార్ అసెంబ్లీ ఎన్నికల జాబితాల నుంచి నిరుపేదలు, అణచివేతకు గురైన, మైనారిటీల ఓట్లను కావాలనే ఎన్నికల సంఘం తొలగించిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పదవిలో ఉన్నా.. పదవీ విరమణ చేసినా నిబంధనలను ఉల్లంఘించిన ఎన్నికల సంఘం అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులను వెరిఫికేషన్ ప్రక్రియలో అనుమతించాలని సుప్రీం కోర్టు చెప్పినా.. ఎన్నికల సంఘం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. రాజ్యాంగం కబ్జాలో ఉందని, రాజ్యాంగ నిర్మాణాన్ని ధ్వంసం చేయడానికి బీజేపీ తన అధికారాన్ని ఉపయోగిస్తోందని సోనియా గాంధీ దుయ్యబట్టారు. ఆమె ప్రత్యేక సందేశాన్ని సదస్సులో వినిపించారు.
అరుణ్ జైట్లీపై వ్యాఖ్యలు.. విమర్శలు
‘‘ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. అందుకని, ఈ విషయం ఇప్పుడు చెప్పకూడదు. కానీ, చెప్పక తప్పడం లేదు. సాగు చట్టాలపై మేం పోరాడుతున్నప్పుడు అరుణ్ జైట్లీ నా వద్దకు వచ్చారు. మీరు ఇలాగే వ్యతిరేకిస్తూ ఉంటే మీపై చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించారు’’ అని రాహుల్ వెల్లడించారు. అయితే, మీరు తప్పుడు వ్యక్తి వద్దకు వచ్చారని, కాంగ్రె్‌సవాదిని ఎవరూ బెదిరించడం కానీ, లొంగదీసుకోవడం కానీ చేయలేరని, తాము కాంగ్రెస్ వాళ్లమే కానీ పిరికివాళ్లం కాదని, బ్రిటిష్ వాళ్లే తమను లొంగదీసుకోలేకపోయారని ఆయనకు జవాబు ఇచ్చానని రాహుల్ చెప్పారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలను అరుణ్ జైట్లీ తనయుడు రోహన్ జైట్లీ ఖండించారు. తన తండ్రి 2019లోనే చనిపోయారని, కానీ, సాగు చట్టాలను మాత్రం 2020లో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి
ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్
Read latest Telangana News And Telugu News