Rahul Gandhi: బీజేపీ, ఈసీ కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయి..
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:46 PM
బిహార్ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరగబోతోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ విషయంపై మరోసారి బీజేపీ, ఈసీపై విమర్శలు చేశారు.
ఢిల్లీ: బీజేపీ, ఈసీపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఓట్ల చోరీపై ఇప్పటివరకు బీజేపీ, ఈసీ స్పందించలేదని తెలిపారు. ఓట్ల చోరీతోనే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని ఆరోపించారు. ఓట్ల చోరీపై తమ దగ్గర చాలా సమాచారం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. హరియాణాలో హోల్‌సేల్‌గా ఓట్ల చోరీ జరిగిందని పేర్కొన్నారు. బిహార్‌లో కూడా ఇదే ఘటన పునరావృతం కాబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, గుజరాత్‌లోనూ ఇదే జరిగిందని వివరించారు. ఓట్ల చోరీపై బీజేపీ ఆత్మరక్షణలో పడిందే తప్ప వ్యతిరేకించట్లేదని చెప్పారు. బీజేపీ, ఈసీ కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
అయితే.. బీజేపీ, ఈసీపై గతంలో కూడా రాహుల్ గాంధీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని వాటిద్వారా అక్కడి ఎన్నికను చోరీచేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఇది ఆపరేషన్ సర్కార్ చోరీ అని విమర్శించారు. ఒక బ్రెజిల్ మోడల్ ఫొటోతో 22 నకిలీ ఓట్లు సృష్టించినా ఈసీఐ ఎందుకు కనిపెట్టలేకపోయిందని ప్రశ్నించారు. ఒకే ఇంట్లో 501 మంది ఓటర్లు ఉన్నట్లు చూపినా గుర్తించలేకపోయారన్నారు. బిహార్‌లోనూ ఇలా ఓట్ల చోరీ జరిగే ప్రమాదం లేకపోలేదని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. హరియాణాలో ఎన్నికలకు ముందు ఓటరు జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా, ఇప్పుడు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడింది. అవన్నీ అవాస్తవాలని తిప్పికొట్టింది. రాహుల్ ఆరోపణలను ఈసీ కూడా ఖండించింది. జాబితాలపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదని ఈసీ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
Jubilee Hills by-election: మద్యం ప్రియులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
TPCC chief Mahesh Kumar Goud: మరో డిప్యూటీ సీఎం