President Nominated: రాజ్యసభకు ఉజ్వల్ నికమ్
ABN , Publish Date - Jul 14 , 2025 | 05:08 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేశారు. వీరిలో ముంబైపై ఉగ్రవాద దాడి 26/11 కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్..

26/11 ఉగ్ర దాడి కేసులో ఈయనే పీపీ.. పెద్దల సభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి
విదేశాంగ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లాకూ చాన్సు
కేరళ బీజేపీ నేత సదానందన్ మాస్టర్, చరిత్రకారిణి మీనాక్షి జైన్‌కు కూడా..
న్యూఢిల్లీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేశారు. వీరిలో ముంబైపై ఉగ్రవాద దాడి (26/11) కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా ఉన్న ఉజ్వల్ దేవరావ్ నికమ్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా, ఢిల్లీకి చెందిన చరిత్రకారిణి ‘పద్మశ్రీ’ మీనాక్షి జైన్, కేరళ బీజేపీ నేత సి.సదానందన్ మాస్టర్ ఉన్నారు. వీరికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. రాజ్యాంగంలోని 80వ అధికరణలోని 1ఏ, 3 క్లాజుల కింద తనకు సంక్రమించిన అధికారాలతో రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని ఎంపిక చేసే అవకాశముంది. ఈ జాబితాలో ప్రస్తుతం నాలుగు ఖాళీలు ఉండగా.. వాటిని ఆదివారం భర్తీచేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్రలోని జల్గావ్‌లో జన్మించిన నికమ్ (73).. ప్రముఖ న్యాయవాది. ఆ రాష్ట్రంలో పలు కీలక కేసుల్లో న్యాయవాదిగా ఉన్నారు. ముంబైపై ఉగ్రదాడిలో పట్టుబడిన అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష పడడంలో ముఖ్యపాత్ర పోషించారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. శృంగ్లా 2020-22 నడుమ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. 2023లో జరిగిన జి-20 సదస్సు సమన్వయకర్తగా వ్యవహరించారు. బీజేపీలో చేరారు. మీనాక్షి జైన్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ మాజీ సంపాదకుడు గిరిలాల్ జైన్ కుమార్తె. చరిత్రకారిణి అయిన ఈమె మధ్యయుగాల భారతంపై పుస్తకం రాశారు. వాజపేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్‌సీఈఆర్‌టీ ఈ పుస్తకాన్ని పాఠ్యగ్రంథంగా చేసింది. 2004లో యూపీఏ సర్కారు రాగానే ఆమె పుస్తకాన్ని తొలగించింది. ఢిల్లీలోని గార్గి కాలేజీలో చరిత్ర బోధించే మీనాక్షి.. మోదీ ప్రభుత్వ హయాంలో ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్’లో సభ్యురాలిగా నియమితులయ్యారు. 2020లో ఆమెకు పద్మశ్రీ కూడా లభించింది. అయోధ్యలో రామజన్మభూమిపై కూడా ఆమె పుస్తకం రాశారు. ఇక సదానందన్ మాస్టర్ కేరళలోని కన్నూర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వామపక్ష నేపథ్యం ఉన్న ఈయన ఆర్‌ఎస్ఎస్‌లో చేరడంతో సీపీఎం కార్యకర్తలు 1994లో ఆయన కాళ్లు నరికేశారు.
2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూత్తుపరంబలో బీజేపీ తరఫున పోటీ చేసిన మాస్టర్‌ను గెలిపించేందుకు ప్రధాని మోదీ స్వయంగా ప్రచారం చేయడం విశేషం. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రీత్యా సదానందన్ ఎంపికకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేయడం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపుతుందని భావిస్తున్నారు. ఈ నలుగురు నామినేటెడ్ సభ్యులతో కలిపి సభలో అధికార ఎన్‌డీఏ బలం 133కి పెరిగింది. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కీలకమైన ఆర్థిక బిల్లులను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇది మోదీ ప్రభుత్వానికి లాభిస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ప్రధాని ఏమన్నారంటే..
న్యాయరంగంలో, రాజ్యాంగానికి నికమ్ సేవలు ఆదర్శప్రాయమని.. విజయవంతమైన న్యాయవాది మాత్రమే కాదని.. ముఖ్యమైన కేసుల్లో న్యాయం కోసం ముందువరుసలో నిలుస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శృంగ్లా దౌత్యవేత్తగా, మేధావిగా, వ్యూహాత్మక ఆలోచనాపరుడిగా పేరుగాంచారని.. భారత విదేశాంగ విధానానికి, జి-20 సదస్సు విజయవంతానికి కృషిచేశారని తెలిపారు. మీనాక్షి జైన్ మేధావి, పరిశోధకురాలు, చరిత్రకారిణిగా ప్రసిద్ధి చెందారని.. విద్య, సాహిత్యం, చరిత్ర, రాజనీతి శాస్త్రంలో ఆమె రచనలు చేశారన్నారు. సదానందన్ మాస్టర్ జీవితం సాహసం, అన్యాయానికి తలొగ్గని వ్యక్తిత్వాన్ని చాటుతోందని తెలిపారు. ఉపాధ్యాయుడిగా, సామాజిక కార్యకర్తగానూ ప్రశంసాత్మక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు.