Prakash Raj: పవన్ కల్యాణ్‌కు దీర్ఘదృష్టి లేదు
ABN , Publish Date - May 07 , 2025 | 05:52 AM
పవన్ కల్యాణ్‌కి ప్రజా సమస్యలపై అవగాహన లేదని, ఆయనకు రాజకీయాల్లో దీర్ఘదృష్టి లేదని నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. తమిళ నటుడు విజయ్ గురించి కూడా ఆయన ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు

ప్రజా సమస్యలపై అవగాహనాలేదు: ప్రకాశ్‌రాజ్
చెన్నై, మే 6 (ఆంధ్రజ్యోతి): సినీ హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌కు ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదని నటుడు ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఆయన మంగళవారం చెన్నైలో సీఎం ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధితో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన అభిమానులంతా పార్టీ కార్యకర్తలుగా మారారు. విజయ్ కూడా అగ్రహీరో. ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కుమారుడు. విజయ్‌కు స్టార్ ఇమేజ్ రాకముందే ఆయన ప్రతి ఒక్కరికీ తెలుసు. పవన్ కొన్నేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ, విజయ్ మాత్రం ఇప్పుడే వచ్చారు.
పవన్ పదేళ్ల రాజకీయ ప్రయాణంలో ఆయనకు దీర్ఘదృష్టి కానీ, ప్రజా సమస్యలపై అవగాహన కానీ ఉన్నట్లు నేను గమనించలేదు. పవన్ కల్యాణ్, విజయ్ తమ స్టార్ ఇమేజ్ను పక్కనబెట్టి ప్రజల్లోకి వచ్చి గెలుపు స్థానాన్ని కోరుకుంటున్నారు. విజయ్‌కు ఉన్న ఇమేజ్ కారణంగా తమిళనాట కొన్ని స్థానాలు దక్కవచ్చు. ఆ తర్వాత ఆయన తన సత్తాను నిరూపించుకోవాలి’ అని అన్నారు.