PM Modi: మరాఠీలో మాట్లాడేదా.. రాజ్యసభ నామినీతో మోదీ సరదా సంభాషణ
ABN , Publish Date - Jul 13 , 2025 | 09:03 PM
తన నామినేషన్ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటిగా తనకు తెలియజేశారని, అప్పుడు మరాఠీలోనే మోదీ తనతో మాట్లాడారని ఉజ్వల్ నికం చెప్పారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేసిన నలుగురిలో ఒకరైన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం (Ujjwal Nikam) ఇందుకు సంబంధించి ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. తన నామినేషన్ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటిగా తనకు తెలియజేశారని, అప్పుడు మరాఠీలోనే మోదీ మాట్లాడారని చెప్పారు.
'ఆయన (మోదీ) మరాఠీలో మాట్లాడటం ప్రారంభించారు. హిందీలో మాట్లాడనా? మరాఠీలో మాట్లాడానా? అంటూ మరాఠీలోనే నన్ను అడిగాడు. నేను వెంటనే నవ్వేశాను. అది విని ఆయన కూడా హాయిగా నవ్వేశారు' అని నికం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. మరాఠీని కించపరిస్తే సహించేది లేదంటూ మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడులకు దిగుతున్న నేపథ్యంలో ఉజ్వల్ నికం, మోదీ మధ్య సరదా సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది. ముంబైలో మహారాష్ట్రేయత భాష మాట్లాడుతున్న వారిని టార్గెట్ చేస్తున్న ఘటనలపై అడిగినప్పుడు నికిం ఆచితూచి స్పందించారు. తన ఎదుగలకు హిందీ ఉపయోగపడిందని, అయితే తాను ఏ రాష్ట్రంలో పర్యటిస్తే అక్కడి స్థానిక భాష నేర్చుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
జాతీయ విద్యా విధానంలో భాగంగా హిందీ భాషా బోధనపై మహారాష్ట్రంలో కొద్దికాలంగా వివాదం నడుస్తోంది. మరాఠీ భాష మద్దతుదారులు ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందీని ప్రైమరీ స్కూళ్లల్లో విద్యార్థులకు బోధించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరాఠీ భాష, సంస్కృతిని అవమానిస్తే సహించేది లేదంటూ ఓ ఆటోడ్రైవర్‌పై శివసేన, ఎంఎన్ఎస్ మద్దతుదారులు శనివారంనాడు దాడి చేయడం సంచలనమైంది.
ఇవి కూడా చదవండి..
రాజ్యసభకు హర్షవర్ధన్, ఉజ్వల్ నికం.. నామినేట్ చేసిన రాష్ట్రపతి
ఢిల్లీ వర్శిటీ విద్యార్థిని అదృశ్యం.. రంగంలోకి పోలీసులు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి