PM Modi: మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం.. 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం
ABN , Publish Date - Jun 16 , 2025 | 02:48 PM
సైప్రస్ ప్రభుత్వ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇరుదేశాల సంస్కృతి, సోదరభావం, వసుదైవ కుటుంబ భావనకు ప్రతీక అని చెప్పారు.

నికోసియా: సైప్రస్ (Cyprus) పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి ఆ దేశ అత్యున్నత పురస్కారం 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3' (Grand Cross of the Order of Makarios III)ను ప్రధానం చేశారు. ప్రధాని ఈ గౌరవాన్ని స్వీకరిస్తూ ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ చేతుల మీదుగా మోదీ ఈ పురస్కారం అందుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ తొలి అధ్యక్షుడు మకరియోస్ 3 పేరుతో ఈ అత్యున్నత పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.
సైప్రస్ ప్రభుత్వ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇరుదేశాల సంస్కృతి, సోదరభావం, వసుదైవ కుటుంబ భావనకు ప్రతీక అని చెప్పారు. రెండు దేశాల మధ్య క్రియాశీల భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాల తర్వాత సైప్రస్‌లో భారత ప్రధాని ఒకరు పర్యటించడం ఇదే ప్రథమం.
అవార్డు ప్రదానానికి సంబంధించిన వీడియోను ప్రధాని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. సైప్రస్ అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, ఇరుదేశాల మధ్య స్నేహానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నామని చెప్పారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం సైప్రస్ చేరుకున్న ప్రధానికి నికోస్ క్రిస్టోడౌలిడెస్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. సైప్రస్ పర్యటన అనంతరం కెనడాకు మోదీ పయనమవుతారు. అక్కడ జరుగనున్న జీ-7 సదస్సులో పాల్గొంటారు. చివరిగా క్రొయేషియాలో అధికారిక పర్యటన జరుపుతారు.
ఇవి కూడా చదవండి..
ఈసారి జనగణనతోపాటు కులగణన కూడా.. ఆరు నెలలపాటు లెక్కింపు
ఎయిర్ ఇండియా హాంగ్‌కాంగ్-ఢిల్లీ విమానంలో సాంకేతిక లోపం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి